IND VS AUS : తొలి రోజు వర్షార్పణం.. 13.2 ఓవర్లపాటే సాగిన ఆట

by Harish |
IND VS AUS : తొలి రోజు వర్షార్పణం.. 13.2 ఓవర్లపాటే సాగిన ఆట
X

దిశ, స్పోర్ట్స్ : అందరూ భయపడినట్టే జరిగింది. మూడో టెస్టుకు వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో తొలి రోజు వర్షార్పణమైంది. బ్రిస్బేన్‌లో శనివారం మొదలైన మ్యాచ్‌కు వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు.దీంతో మొదటి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది.

ఆకాశం మేఘావృతమై ఉండటంతో వర్షం ఏ క్షణంలోనైనా పడొచ్చనే భయంతోనే ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. ఆసిస్ బ్యాటింగ్ ప్రారంభించి ఐదు ఓవర్లు పూర్తయిన తర్వాత జల్లులు మొదలయ్యాయి. దీంతో అరంగట సమయం వృథా అయ్యింది. కాసేపటి తర్వాత వర్షం తగ్గడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. ఆసిస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీలను భారత బౌలర్లు ఇబ్బంది పెట్టారు. దీంతో వారు ఆచితూచి ఆడుతూ వికెట్లు కాపాడుకున్నారు.

ఇలా ఆట సాగుతుండగా 13వ ఓవర్‌లో రెండు బంతులు పడ్డాక వర్షం మళ్లీ కురిసింది. కాసేపు చూసిన అంపైర్లు లంచ్ విరామాన్ని ముందుగానే ఇచ్చారు.భోజన విరామం తర్వాత కూడా వర్షం తగ్గలేదు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్టు ప్రకటించారు. దీంతో దాదాపు రెండున్నర సెషన్ల ఆట కొట్టుకుపోయింది. 13.2 ఓవర్లలో ఆసిస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఖవాజా(19 నాటౌట్), మెక్‌స్వీనీ(4 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed