- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరీస్ క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడు అఫ్గాన్‌తో మూడో టీ20
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న చివరి టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటుతున్నది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకుంది. నేడు బెంగళూరు వేదిక ఆఖరి మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమ్ ఇండియాకు మూడోదీ నెగ్గడం కష్టమేమి కాదు. గత మ్యాచ్‌ల్లోలాగే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడో టీ20లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనుకుంటున్నది. అలాగే, పొట్టి ప్రపంచకప్‌కు ముందు టీమ్ కాంబినేషన్‌పై ఓ అంచనాకి రావడానికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్ కానుంది. మరోవైపు, ఇప్పటికే సిరీస్ కోల్పోయిన అఫ్గాన్ జట్టు ఆఖరి మ్యాచ్‌లోనైనా సత్తాచాటి పరువు కాపాడుకోవాలనుకుంటున్నది. అయితే, బలమైన భారత్‌ను ఓడించాలంటే ఆఫ్ఘనిస్తాన్ శక్తికి మించి పోరాటం చేయాల్సిందే.
వారికి చాన్స్ దక్కుతుందా?
ఇప్పటికే సిరీస్ టీమ్ ఇండియా సొంతమవడంతో ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. తొలి రెండు టీ20ల్లో బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించొచ్చు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తొలి టీ20 ఆడినప్పటికీ.. విరాట్ కోహ్లీ పునరాగమనంతో రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. మూడో మ్యాచ్‌కు కూడా అతను బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతన్ని జట్టులోకి తీసుకోవాలంటే కోహ్లీ లేదా శివమ్ దూబెలలో ఒకరిని పక్కనపెట్టాలి. విరాట్‌ను పక్కనపెట్టడం కుదరకపోవచ్చు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన దూబెను తప్పించడం కష్టమే. సౌతాఫ్రికాపై వన్డే మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్ అందుకున్న సంజూ శాంసన్ ఈ సిరీస్‌లో తుది జట్టులో ఆడతాడని అంతా భావించారు. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లోనూ అతనికి బదులు జితేశ్ శర్మ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. అయితే, జితేశ్ శర్మ పెద్దగా రాణించలేదు. మూడో టీ20లో శాంసన్‌కు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా మూడో టీ20లో ఆడేందుకు అవకాశాలు ఉన్నాయి. యువ పేసర్ అవేశ్ ఖాన్ సైతం గత రెండు మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. నేటి మ్యాచ్‌లో ముకేశ్‌కు బదులు అతన్ని తీసుకునే చాన్స్ ఉంది.
రోహిత్, కోహ్లీపై ఫోకస్
ఆఖరి టీ20లో అందరి దృష్టి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శనపైనే ఉండనుంది. దాదాపు 14 నెలల తర్వాత వీరు ఈ సిరీస్‌తో టీ20ల్లోకి పునరాగమనం చేశారు. అయితే, రోహిత్ అంచనాలను అందుకోలేకపోయాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా రనౌట్ అయితే, రెండో టీ20లో తొలి ఓవర్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక, చివరి మ్యాచ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే, వ్యక్తిగత కారణాలతో తొలి టీ20కి దూరమైన విరాట్ రెండో టీ20 ఆడాడు. రీఎంట్రీ మ్యాచ్‌లో అతను ఫ్యాన్స్‌ను పూర్తిగా సంతృప్తి పర్చలేకపోయాడు. తనదైన మార్క్ షాట్లతో అలరించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. 16 బంతుల్లో 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. నేటి మ్యాచ్‌లో విరాట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్ అయిన ఎం. చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో కోహ్లీ చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బ్యాటర్లకు స్వర్గధామం
బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా ఉండనుందని గత మ్యాచ్‌లను పరిశీలిస్తే తెలుస్తోంది. ఫ్లాట్ వికెట్, చిన్న బౌండరీల కారణంగా ఈ పిచ్‌పై బ్యాటర్లు చెలరేగనున్నారు. స్లో బౌలర్లు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు అంచనా. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 141. ఈ స్టేడియంలో జరిగిన 9 మ్యాచ్‌ల్లో ఐదింట చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. కాబట్టి, నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచినట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. మంచు ప్రభావం అందుకు ఓ కారణం.
తుది జట్లు(అంచనా)
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబె, సంజూ శాంసన్, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్/ముకేశ్ కుమార్.
ఆఫ్ఘనిస్తాన్ : ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), గుర్బాజ్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీమ్ జనాత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నయీబ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫారూఖీ, నవీన్ ఉల్ హక్.