IND W vs AUS W : స్మృతి మంధాన సెంచరీ వృథా.. మూడో ODIలో ఆస్ట్రేలియా విజయం

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-11 18:43:17.0  )
IND W vs AUS W : స్మృతి మంధాన సెంచరీ వృథా.. మూడో ODIలో ఆస్ట్రేలియా విజయం
X

దిశ, స్పోర్ట్స్ : స్మతి మంధాన కెరీర్‌లో తొమ్మిదో సెంచరీ చేసి రాణించినా మూడో వన్డేలో భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో హర్మన్ ప్రీత్ కౌర్ సేన 83 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. 299 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 35 ఓవర్లకు 184/3తో పటిష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియా బౌలర్ ఆష్లీన్ గార్డ్‌నర్(5/30) విజృంభించడంతో 45.1 ఓవర్లలో భారత జట్టు 215 పరుగులకే కుప్పకూలింది. అన్నాబెల్ సదర్లాండ్ ఆల్ రౌండ్ షో చేసి ఆస్ట్రేలియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 95 బంతుల్లో 110 పరుగులు చేసిన అన్నాబెల్ సదర్లాండ్ తర్వాత కీలకమైన హర్మన్ ప్రీత్ కౌర్ వికెట్ పడగొట్టింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను సదర్లాండ్ సొంతం చేసుకుంది. భారత జట్టులో స్మృతి మందనా 109 బంతుల్లో 105 పరుగులతో రాణించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది.

స్మృతి మంధాన రికార్డు..

ఈ మ్యాచ్‌లో తొమ్మిదో సెంచరీ నమోదు చేసిన స్మృతి మందనా అత్యధిక సెంచరీలు చేసినా ఆసియా బ్యాటర్ చమరి ఆటపట్టు రికార్డును సమం చేసింది. దీంతో పాటు ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు(4) చేసిన తొలి మహిళా ప్లేయర్‌గా నిలిచింది.

Advertisement

Next Story