IND VS SL : గంభీర్, సూర్యలకు తొలి పరీక్ష.. నేడు శ్రీలంకతో తొలి టీ20

by Harish |
IND VS SL : గంభీర్, సూర్యలకు తొలి పరీక్ష.. నేడు శ్రీలంకతో తొలి టీ20
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమ్ ఇండియా తొలిసారిగా ఓ టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. వరల్డ్ చాంపియన్ హోదాలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు ఆడబోతున్నది. ఈ సిరీస్‌తోనే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త టీ20 కెప్టెన్ సూర్యకుమార్ బాధ్యతలు చేపట్టబోతుండటం మరో ప్రత్యేకత. హెడ్ కోచ్‌గా గంభీర్‌, కెప్టెన్‌గా సూర్యకుమార్‌కు ఈ సిరీస్ తొలి పరీక్ష కానుంది. మరి, వాళ్లిద్దరు తమ ప్రయాణాన్ని ఎలా ప్రారంభిస్తారో చూడాలి. ఈ సిరీస్‌లో నేడే తొలి టీ20.

తుది జట్టులో చోటెవరికి?

తొలి టీ20కి తుది జట్టు ఎంపిక హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకు తలనొప్పిగా మారింది. కొన్ని స్థానాలకు ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడుతుండటంతో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై సందిగ్ధం నెలకొంది. వికెట్ కీపర్ స్థానానికి రిషబ్ పంత్, సంజూ శాంసన్ పోటీలో ఉన్నారు. శాంసన్‌కు అవకాశాలు రావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే, శాంసన్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే చాన్స్ ఉంది. పంత్ తుది జట్టులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, 5వ స్థానం కోసం రింకు సింగ్, శివమ్ దూబె, రియాన్ పరాగ్ మధ్య పోటీ నెలకొంది. టీమ్ మేనేజ్‌మెంట్ రింకూకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అక్షర్ పటేల్‌తోపాటు మరో స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకునే చాన్స్ ఉంది. సుందర్‌ను పక్కనపెడితే పేస్ ఆల్‌రౌండర్ కోటాలో దూబెను తీసుకోవచ్చు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో రియాన్ పరాగ్‌ ఆకట్టుకోలేకపోయాడు. కానీ, టీమ్ మేనేజ్‌మెంట్ ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్‌లో సిరాజ్ కాలుకి గాయమైంది. తొలి టీ20కి అతను అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. అతను దూరమైతే ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్‌‌లలో ఒక్కరికి చోటు దక్కొచ్చు.

శ్రీలంకలో వీళ్లు

శ్రీలంక స్టార్ బౌలర్లు నువాన్ తుషారా, దుష్మంత చమీరా సిరీస్‌కు దూరమవడం ఆ జట్టుకు భారీ లోటే. శ్రీలంక జట్టు నిలకడలేమి సమస్య ఎదుర్కొంటుంది. ఓపెనర్ నిశాంక, కెప్టెన్ అసలంక, కామిందు మెండిస్‌, కుసాల్ మెండిస్‌ జట్టు బ్యాటింగ్ దళంలో కీలకంగా ఉన్నారు. ఆల్‌రౌండర్ హసరంగ బ్యాటుతో, బంతితో కీలక పాత్ర పోషించే అవకావం ఉంది. ఇక, పేస్ సంచలనం పతిరణ భారత బ్యాటర్లకు సవాల్ విసిరొచ్చు. అతనిలా సత్తాచాటే మరో పేసర్ లేకపోవడం శ్రీలంకకు ప్రతికూలంశమే.

భారత్ 19.. శ్రీలంక 9

టీ20ల్లో శ్రీలంకపై టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇరు జట్లు 29సార్లు తలపడితే.. భారత్ 19 మ్యాచ్‌లు నెగ్గింది. శ్రీలంక 9 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో ఐదింట భారత్ నెగ్గగా.. శ్రీలంక రెండు మ్యాచ్‌లను తన ఖాతాలో వేసుకుంది.

పిచ్ రిపోర్టు

పల్లెకెల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 185. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే చాన్స్ ఉంది. ఈ స్టేడియంలో 23 టీ20లు జరగగా అందులో 8 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా.. చేజింగ్ జట్టు 12 సందర్భాల్లో నెగ్గింది.

తుది జట్లు(అంచనా)

భారత్ : జైశ్వాల్, గిల్, రిషబ్ పంత్, సూర్యకుమార్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్, సిరాజ్.

శ్రీలంక : నిశాంక, కుసాల్ పెరీరా, కుసాల్ మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), కామిందు మెండిస్, డసున్ షనక, హసరంగ, దునిత్ వెల్లాలాగే, తీక్షణ, పతిరణ, మధుశంక.

Advertisement

Next Story