ద్రవిడ్‌ రికార్డును బ్రేక్ చేసిన జైశ్వాల్.. విరాట్‌ ఘనతపై కన్ను

by Harish |
ద్రవిడ్‌ రికార్డును బ్రేక్ చేసిన జైశ్వాల్.. విరాట్‌ ఘనతపై కన్ను
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. అరుదైన రికార్డులను సైతం అలవోకగా అధిగమిస్తున్నాడు. తాజాగా భారత మాజీ దిగ్గజ క్రికెటర్, టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్‌పై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో ద్రవిడ్‌ను జైశ్వాల్ వెనక్కినెట్టాడు. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఈ ఘనత సాధించాడు.

నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ 117 బంతుల్లో 73 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో ప్రస్తుతం సిరీస్‌లో జైశ్వాల్ 618 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా, ఓ టెస్టు సిరీస్‌లో 600కిపైగా పరుగులు చేసిన ఐదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, దిలీప్ సర్దేశాయ్ సరసన చేరాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ 774 పరుగులతో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. మరోవైపు, ఇంగ్లాండ్‌పై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ(655) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు రాహుల్ ద్రవిడ్(602) రెండో స్థానంలో ఉండగా.. తాజాగా జైశ్వాల్ అతన్ని వెనక్కినెట్టాడు. జైశ్వాల్ 618 పరుగులతో రెండో స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో కోహ్లీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఈ సిరీస్‌లో మరో 38 పరుగులు చేసే విరాట్‌ను అధిగమిస్తాడు. నాలుగో టెస్టులో ఇంకో ఇన్నింగ్స్‌తోపాటు ఆఖరి టెస్టు ఉండటంతో కోహ్లీ రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేయడం ఖాయమే.

జైశ్వాల్ రెండో రోజు మరో దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. ఈ ఏడాది 23 సిక్స్‌లు కొట్టిన జైశ్వాల్.. ఓ క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో 2008లో 22 సిక్స్‌లు బాదిన వీరూ టాప్ పొజిషన్‌లో ఉండగా.. 16 ఏళ్ల తర్వాత జైశ్వాల్ దాన్ని బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌‌లోనే జైశ్వాల్ 23 సిక్స్‌లు కొట్టడం విశేషం. భీకర ఫామ్‌లో ఉన్న జైశ్వాల్ ఈ ఏడాది సిక్స్‌ల సంఖ్యను మరింత మరింత పెంచుతానడంలో సందేహం లేదు. పంత్(21 సిక్స్‌లు), రోహిత్(20 సిక్స్‌లు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed