కోహ్లీ ముందు మరో రికార్డు.. హైదరాబాద్ టెస్టులో దక్కేనా?

by Harish |
కోహ్లీ ముందు మరో రికార్డు.. హైదరాబాద్ టెస్టులో దక్కేనా?
X

దిశ, స్పోర్ట్స్ : రికార్డులు ఉన్నది బద్దలు కొట్టడానికే అన్నట్టు ఉంటుంది విరాట్ కోహ్లీ ఆట తీరు. తన పేరిట ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పి రికార్డుల రారాజుగా గుర్తింపు పొందాడు. తిరిగి ఫామ్ అందుకున్న తర్వాత కూడా ఆ రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఇటీవల వన్డే వరల్డ్ కప్‌లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై 50వ శతకం బాది క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(49) రికార్డును తిరిగరాశాడు. తాజాగా టెస్టుల్లో విరాట్‌ను మరో రికార్డు ఊరిస్తోంది. అదే 9 వేల పరుగుల మైలురాయి. ఇప్పటివరకు కోహ్లీ 113 టెస్టుల్లో 49.16 సగటుతో 8,848 పరుగులు చేశాడు. మరో 152 పరుగులు చేస్తే 9 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు సన్నద్ధమవుతున్న విరాట్.. ప్రస్తుత అతని ఫామ్‌ను బట్టి ఈ సిరీస్‌లో ఈ ఘనత సాధించడం ఖాయమే. ఈ నెల 25 నుంచి 29 వరకు జరిగే తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులోనే విరాట్ 9 వేల పరుగుల మైలురాయిని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో విరాట్‌కు మంచి రికార్డే ఉన్నది. 4 మ్యాచ్‌లు ఆడిన అతను 75.80 సగటుతో 379 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.

ప్రస్తుతం అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, ప్రస్తుత టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, మరో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 200 టెస్టుల్లో 15, 921 పరుగులతో భారత్ నుంచే కాకుండా మొత్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్ 163 మ్యాచ్‌ల్లో 13,265 పరుగులతో రెండో స్థానంలో, సునీల్ గవాస్కర్ 125 టెస్టుల్లో 10,122 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు.

Advertisement

Next Story