ఈ సారి ఇంగ్లాండ్‌ను కూల్చే వరకూ పట్టు వదల్లేదు.. సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్

by Harish |
ఈ సారి ఇంగ్లాండ్‌ను కూల్చే వరకూ పట్టు వదల్లేదు.. సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్
X

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో రెండు రోజులు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ ఇండియా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, అనూహ్యంగా పట్టు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు. అయితే, రెండో టెస్టులో రోహిత్ సేన ఆ లోపాలను అధిగమించింది. తొలి రోజు నుంచి జట్టు గెలిచే వరకూ పట్టు కోల్పోలేదు. ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ పెట్టినా ఎక్కడో కంగారు. బౌలర్లు ఏం చేస్తారో అన్న టెన్షన్. కానీ, అనుమానలన్నింటినీ పంటాపంచలు చేశారు. ప్రత్యర్థిని బెంబేలెత్తించిన భారత బౌలర్లు మరో రోజు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌ను ఓటమితో మొదలుపెట్టిన రోహిత్ సేన పుంజుకుంది. రెండో టెస్టు‌లో భారీ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా డాక్టర్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో సోమవారం 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 292 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్(209) డబుల్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 253 పరుగులకే పరిమితం చేసిన టీమ్ ఇండియా 143 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత గిల్(104) సెంచరీతో మెరవడంతో రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల లక్ష్యం ఉంచింది. ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 67/1తో ఛేదనను కొనసాగించిన ఇంగ్లాండ్ 255 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ జాక్ క్రాలీ(73) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బెన్ ఫోక్స్(36), టామ్ హార్ట్లీ(36) ఆఖర్లో పోరాటం చేశారు. అయితే, బుమ్రా(3/46), అశ్విన్(3/7) కీలక వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ముకేశ్, కుల్దీప్, అక్షర్ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా, రాజ్‌కోట్ వేదికగా ఈ నెల 15 నుంచి 19 వరకు మూడో టెస్టు జరగనుంది.

మొదలెట్టిన అశ్విన్.. ముగించిన బుమ్రా

ఒక్క రోజు ముందుగానే ఇంగ్లాండ్ ఆట ముగిసిందంటే కారణం అశ్విన్, బుమ్రా. నాలుగో రోజు మొదట అశ్విన్ టాపార్డర్‌ను పెవిలియన్‌ను పంపితే.. లోయర్ ఆర్డర్‌‌ను కూల్చేశాడు బుమ్రా. 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనను మెరుగ్గానే ఆరంభించిన ఇంగ్లాండ్ ఆదివారమే తొలి వికెట్‌గా బెన్ డక్కెట్(28) వికెట్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 67/1తో ప్రత్యర్థి జట్టు నాలుగో రోజు ఆట కొనసాగించింది. అయితే, తొలి సెషన్‌లో పూర్తిగా భారత బౌలర్లు పైచేయి సాధించి ఇంగ్లాండ్‌ను బలహీనపరిచారు. కానీ, క్రీజులో పాతుకపోయిన ఓవర్‌నైట్ బ్యాటర్ జాక్ క్రాలీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓవర్‌నైట్ బ్యాటర్ రెహాన్ అహ్మద్(23), ఓలీ పోప్(23), జోరూట్(16)లతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే, మరో ఎండ్‌లో మాత్రం భారత బౌలర్లు వికెట్లు తీస్తూనే ఉన్నారు. రెహాన్ అహ్మద్‌ను అక్షర్ వికెట్ల ముందు దొరకబచ్చుకుంటే.. ఓలీ పోప్, జోరూట్‌లను అశ్విన్ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 154/4 స్కోరుతో కష్టాల్లో పడింది. కాసేపటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జాక్ క్రాలీ(73) సైతం తన పోరాటాన్ని ముగించాడు. కుల్దీప్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ధాటిగా ఆడుతున్న బెయిర్‌స్టో(26)ను ఆ తర్వాతి ఓవర్‌లోనే బుమ్రా పెవిలియన్ పంపాడు. ఓలీ పోప్, బెయిర్ స్టో రెండు వికెట్లను భారత్ రివ్యూ తీసుకుని మరి సాధించడం విశేషం. తొలి సెషన్‌లో ఇంగ్లాండ్ కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి 194/6 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. విరామం అనంతరం అనవసర పరుగు కోసం యత్నించిన కెప్టెన్ బెన్ స్టోక్స్(11)ను శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ త్రో పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత బెన్ ఫోక్స్(36), టామ్ హార్ట్లీ(36) ఆచితూచి ఆడి ఇంగ్లాండ్ ముగింపును ఆలస్యం చేశారు. ఈ జోడీ 8 వికెట్‌కు విలువైన 55 పరుగులు జోడించింది. బుమ్రా తన బౌలింగ్‌లో బెన్ ఫోక్స్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా.. కాసేపటికే షోయబ్ బషీర్(0)ను ముకేశ్ డకౌట్ చేశాడు. ఇక, చివరి వికెట్‌గా టామ్ హార్ట్లీ‌ని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ ఓటమిని లాంఛనం చేశాడు.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 396

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 253

భారత్ రెండో ఇన్నింగ్స్ : 255

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 292 ఆలౌట్(69.2 ఓవర్లు)

జాక్ క్రాలీ ఎల్బీడబ్ల్యూ(బి)కుల్దీప్ 73, బెన్ డక్కెట్(సి)భరత్(బి)అశ్విన్ 28, రెహాన్ అహ్మద్ ఎల్బీడబ్ల్యూ(బి)అక్షర్ 23, ఓలీ పోప్(సి)రోహిత్(బి)అశ్విన్ 23, జోరూట్(సి)అక్షర్(బి)అశ్విన్ 16, బెయిర్‌స్టో ఎల్బీడబ్ల్యూ(బి)బుమ్రా 26, బెన్ స్టోక్స్ రనౌట్(శ్రేయస్ అయ్యర్) 11, బెన్ ఫోక్స్(సి అండ్ బి)బుమ్రా 36, టామ్ హార్ట్లీ(బి)బుమ్రా 36, షోయబ్ బషీర్(సి)భరత్(బి)ముకేశ్ 0, అండర్సన్ 5 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 15.

వికెట్ల పతనం : 50-1, 95-2, 132-3, 154-4, 194-5, 194-6, 220-7, 275-8, 281-9, 292-10

బౌలింగ్ : బుమ్రా(17.2-4-46-3), ముకేశ్(5-1-26-1), కుల్దీప్(15-0-60-1), అశ్విన్(18-2-72-3), అక్షర్(14-1-75-1)

Advertisement

Next Story