బ్రిస్బేన్‌లో భారత్ పుంజుకుంటుందా?.. ఆస్ట్రేలియాతో నేటి నుంచే మూడో టెస్టు

by Harish |
బ్రిస్బేన్‌లో భారత్ పుంజుకుంటుందా?.. ఆస్ట్రేలియాతో నేటి నుంచే మూడో టెస్టు
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తొలి టెస్టులో విజయంతో ఘనంగా మొదలుపెట్టిన భారత్.. రెండో టెస్టులో ఘోర పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అడిలైడ్‌ మ్యాచ్‌‌‌ను ఏకపక్షంగా గెలుచుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. నేటి నుంచే బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టులో పరాజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కాంటే చివరి మూడు మ్యాచ్‌ల్లో నెగ్గడం భారత్‌కు తప్పనిసరి. కాబట్టి, బ్రిస్బేన్‌‌లో గెలవడం చాలా ముఖ్యం. ఓడితే ఫైనల్‌ బెర్త్ దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మరి, రోహిత్ సేన అడిలైడ్‌లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని బ్రిస్బేన్‌లో పుంజుకుంటుందో లేదో చూడాలి.

టాపార్డర్‌ నిలబడుతుందా?

గత రెండు టెస్టుల్లో టాపార్డర్ ఏ విధంగా విఫలమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జైశ్వాల్, రాహుల్, కోహ్లీ తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో మెరిసినా.. రెండో టెస్టులో దారుణంగా నిరాశపరిచారు. ఇక, రెండు టెస్టుకు అందుబాటులోకి వచ్చిన గిల్ పెద్దగా ఆకట్టుకోలేదు. టాపార్డర్ వైఫల్యం మిగతా బ్యాటర్లపై ఒత్తిడిలో పడేసింది. కాబట్టి, మూడో టెస్టులో టాపార్డర్ ఆడటం జట్టుకు చాలా కీలకం. రోహిత్ తిరిగి ఓపెనర్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోహిత్, జైశ్వాల్ జట్టుకు శుభారంభం అందిస్తే.. మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు వీలు ఉంటుంది. పంత్ గబ్బాలో మరోసారి రెచ్చిపోవాలని జట్టు, అభిమానులు ఆశిస్తున్నారు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి నిలకడగా రాణిస్తుండటం సానుకూలంశం. బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్‌లో లోపాలే టీమిండియాకు నష్టం కలిగిస్తున్నాయి. బ్రిస్బేన్‌లో లోపాలను అధిగమించి బ్యాటింగ్‌లో పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది.

హర్షిత్ ఔట్.. జడేజా లేదా ఆకాశ్ దీప్?

మూడో టెస్టు కోసం భారత్ తుది జట్టులో పెద్దగా మార్పులు ఏం చేయడం లేదు. ఒకే ఒక్క మార్పు చేయనున్నట్టు తెలుస్తోంది. యువ పేసర్ హర్షిత్ రాణాను పక్కనపెట్టనున్నట్టు సమాచారం. అతని స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా లేదా మరో యువ పేసర్ ఆకాశ్ దీప్‌ను తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

గబ్బాలో మళ్లీ అద్భుతం చేసేనా?

గబ్బా స్టేడియం ఆస్ట్రేలియాకు కంచు కోట. 1988 నుంచి 2021 వరకు ఆ జట్టు అక్కడ ఓడింది లేదు. కానీ, 2021లో టీమిండియా అద్భుతం చేసింది. 33 ఏళ్ల ఆసిస్ జైత్రయాత్రకు భారత్ చెక్ పెట్టింది. గబ్బాలో భారత్‌కు అదే తొలి విజయం కూడా. కోహ్లీ గైర్హాజరులో అజింక్యా రహానే నాయకత్వంలో భారత జట్టు అప్పుడు అద్భుతమే చేసింది. ఆసిస్‌పై 3 వికెట్ల తేడాతో నెగ్గడంతోపాటు సిరీస్ విజయాన్ని సాధించింది. ఆ మ్యాచ్ అనంతరం గబ్బాలో మరోసారి ఇరు జట్లు తలపడబోతున్నాయి. మరి, టీమిండియా మరోసారి అద్భుతం చేస్తుందో లేదో చూడాలి. అయితే, గబ్బాలో చివరి మ్యాచ్‌లో టీమిండియా నెగ్గినప్పటికీ రికార్డులు గొప్పగా ఏం లేవు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఓ విజయం, ఓ డ్రా చేసుకుంది. ఐదింట పరాజయం పాలైంది.

వర్షం ముప్పు

మూడో టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉన్నది. ఐదు రోజులపాటు వర్ష సూచన ఉండటంతో మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. తొలి రోజు 80 శాతం వర్షం పడనున్నట్టు ఆస్ట్రేలియా వాతావారణ శాఖ నివేదిక తెలిపారు. మిగతా నాలుగు రోజులు కూడా వరుణుడు మ్యాచ్‌కు అడ్డు తగులుతాడని చెప్పింది. రెండో రోజు 70 శాతం, మూడో రోజు 70 శాతం, నాలుగో రోజు 40 శాతం, ఆఖరి రోజు 20 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంలో పడతాయి.

పిచ్ రిపోర్టు

ఆసిస్‌లోని మిగతా పిచ్‌ల మాదిరిగానే గబ్బా పిచ్ కూడా పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. పేసర్లు ఆటను శాసించనున్నారు.టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకోవచ్చు. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 327. బ్రిస్బేన్‌లో 68 మ్యాచ్‌లు జరగగా.. 26సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు, 27 సందర్భాల్లో ముందుగా బౌలింగ్ చేసిన జట్లు గెలుపొందాయి.

Advertisement

Next Story

Most Viewed