సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో హద్దులు దాటిన పాక్ ఆటగాళ్లు.. ఆ ముగ్గురిపై ఐసీసీ చర్యలు

by Harish |
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో హద్దులు దాటిన పాక్ ఆటగాళ్లు.. ఆ ముగ్గురిపై ఐసీసీ చర్యలు
X

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై జరుగుతున్న ట్రై సిరీస్‌లో పాకిస్తాన్ ప్లేయర్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పేసర్ షాహీన్ అఫ్రిది దక్షిణాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీతో దురుసుగా ప్రవర్తించగా.. బవుమా రనౌట్ సమయంలో సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్ ఓవరాక్షన్ చేశారు. ఆ సంఘటనలను ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఆ ముగ్గురిపై చర్యలు చేపట్టింది. అఫ్రిది మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధించగా.. షకీల్, కమ్రాన్ గులామ్ మ్యాచ్ ఫీజులో చెరో 10 శాతం కోతపెట్టింది. అంతేకాకుండా, ముగ్గురికి తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది.

అసలేం జరిగిందంటే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్‌లో బ్యాటర్ బ్రీట్జ్కీ, అఫ్రిది మధ్య రెండు సార్లు వాగ్వాదం చోటుచేసుకుంది. 5వ బంతి తర్వాత బ్రీట్జ్కేను ఏదో అంటూ అఫ్రిది అతని వైపు వెళ్లాడు. ఆ తర్వాత బంతికే ఇద్దరి మధ్య మళ్లీ గొడవైంది.అఫ్రిది ేసిన బంతి ఆడిన బ్రీట్జ్కే సింగిల్ తీయగా.. పరుగెత్తే క్రమంలో అఫ్రిదిని బ్రీట్జ్కే ఢీకొట్టాడు. దీంతో అఫ్రిది కోపంతో అతని మీదిమీదికి వెళ్లాడు. కొట్టేస్తా అన్నట్టు చూశాడు. చేతితో బ్రీట్జ్కేను నెట్టాడు. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకుని గొడవను సర్దిచేశారు. ఆ మరుసటి ఓవర్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రనౌటవ్వగా.. దీంతో సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్ ఓవరాక్షన్ చేశారు. బవుమా దగ్గరికు వచ్చి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ రెండు ఘటనలపై చర్యలు చేపట్టిన ఐసీసీ పాక్ ఆటగాళ్లకు మొట్టికాయలు వేసింది. కాగా, ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై పాక్ విజయం సాధించి ట్రై సిరీస్‌లో ఫైనల్‌కు చేరుకుంది.




Next Story