ఐసీసీ టెస్టు జట్టులో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు

by Harish |
ఐసీసీ టెస్టు జట్టులో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు
X

దిశ, స్పోర్ట్స్ : గతేడాదికి సంబంధించి టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్, వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్లను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. గతేడాది ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ప్లేయర్లను ఎంపిక చేసింది. టెస్టు జట్టులో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానం సంపాదించారు. ఆసిస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ఐసీసీ సారథిగా ఎంపిక చేసింది. 2024లో బుమ్రా, జైశ్వాల్, జడేజా అద్భుత ప్రదర్శన చేశారు. జైశ్వాల్ 54.74 సగటుతో 1,478 రన్స్ చేశాడు. జోరూట్ తర్వాత గతేడాది అత్యధిక పరుగులు చేసింది జైశ్వాలే. అలాగే, జడేజా 527 రన్స్, 48 వికెట్లు తీశాడు. ఇక, బుమ్రా విషయానికొస్తే 2024లో అతను భీకర ప్రదర్శన చేశాడు. 71 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అతనే కావడం విశేషం. మరోవైపు, వన్డే జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ఆ జట్టుకు శ్రీలంక ప్లేయర్ చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. శ్రీలంక నుంచి నలుగురు, పాక్, అఫ్గాన్ నుంచి ముగ్గురు చొప్పున, విండీస్ నుంచి ఒక్కరికి చోటు దక్కింది. గతేడాది టీమిండియా వన్డేలు ఎక్కువగా ఆడకపోవడంతోనే భారత ప్లేయర్లకు స్థానం దక్కలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్మృతి మంధాన, దీప్తికి స్థానం

మహిళల ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ జట్టులో భారత స్టార్ ప్లేయర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మలకు స్థానం దక్కింది. గతేడాది స్మృతి మంధాన 13 మ్యాచ్‌ల్లో 747 పరుగులు చేసింది. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు కూడా ఆమె పోటీపడుతోంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 13 మ్యాచ్‌ల్లో 186 రన్స్ చేయడమే కాక 24 వికెట్లు పడగొట్టింది. 11 మందితో కూడిన వన్డే జట్టుకు సౌతాఫ్రికాకు చెందిన లారా వొల్వార్డ్ట్‌ను ఐసీసీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.




Next Story