Paris olympics : జకో సాధించాడు.. ఎట్టకేలకు టెన్నిస్ దిగ్గజం కల సాకారం

by Harish |
Paris olympics : జకో సాధించాడు.. ఎట్టకేలకు టెన్నిస్ దిగ్గజం కల సాకారం
X

దిశ, స్పోర్ట్స్ : దిగ్గజ టెన్నిస్ ఆటగాడు, 24 గ్రాండ్‌స్లామ్స్ విజేత నోవాక్ జకోవిచ్ సాధించాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలన్న కలను సాకారం చేసుకున్నాడు. టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ విభాగంలో జకో చాంపియన్‌గా నిలిచి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో జకోవిచ్ 7-6(7-3), 7-6(7-2) తేడాతో స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జకో, అల్కరాజ్ విజయం కోసం హోరాహోరీగా తలపడ్డారు. అల్కరాజ్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న జకో వరుస సెట్లను టై బ్రేకర్‌లోనే గెలవడం గమనార్హం. దీంతో అల్కరాజ్ రజతంతో సరిపెట్టాడు.

37 ఏళ్ల జకో కెరీర్ ముగింపు దశలో ఎట్టకేలకు పారిస్‌లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. విజయం అనంతరం జకోవిచ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన కూతురిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విజయంతో జకో అరుదైన ఘనత సాధించాడు. కెరీర్ గోల్డెన్ గ్రాండ్ స్లామ్ సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. సింగిల్స్‌లో నాలుగు రకాల గ్రాండ్‌స్లామ్స్(ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)తోపాటు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధిస్తే గోల్డెన్ గ్రాండ్ స్లామ్‌గా పిలుస్తారు. జకో కంటే ముందు స్టెఫీ గ్రాఫ్, ఆండ్రీ అగస్సీ, రాఫెల్ నాదల్, సెరెనా విలియమ్స్ ఈ ఘనత సాధించారు. అలాగే, ఒలింపిక్స్‌లో పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న పెద్ద వయస్కుడిగా కూడా చరిత్ర సృష్టించాడు.



Next Story

Most Viewed