బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ కలకలం.. బంగ్లా కెప్టెన్ సారథిగా ఉన్న జట్టుపైనే ఆరోపణలు

by Harish |
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ కలకలం.. బంగ్లా కెప్టెన్ సారథిగా ఉన్న జట్టుపైనే ఆరోపణలు
X

దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌(బీపీఎల్) 11వ సీజన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. బీపీఎల్‌లో పలు మ్యాచ్‌లు ఫిక్సింగ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) యాంటీ కరెప్షన్ యూనిట్(ఏసీయూ) విచారణ చేపట్టింది. లీగ్‌లో 8 మ్యాచ్‌ల్లో స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.

10 మంది ప్లేయర్లపై ఏసీయూ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అందులో ఆరుగురు బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్లు కావడం గమనార్హం. మిగతావారిలో ఇద్దరు బంగ్లాదేశ్ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు, మరో ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉన్నట్టు సమాచారం. నాలుగు ఫ్రాంచైజీల కార్యలకలాపాలను ఏసీయూ నిశితంగా పరిశీలిస్తోంది. అందులో బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో సారథ్యం వహిస్తున్న ఫార్చ్యూన్ బరిషల్ టీమ్ కూడా ఉన్నట్టు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఫిక్సింగ్ వార్తలపై బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ స్పందించారు. విచారణ జరుగుతుందని, ఫిక్సింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, బీపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇదే మొదటిసారి కాదు. 2013లో బంగ్లా మాజీ కెప్టెన్ మహ్మద్ అష్రాఫుల్ స్పాట్ ఫిక్సింగ్‌లో దొరికిపోయాడు. దీంతో అతను 8 ఏళ్ల నిషేధానికి గురయ్యాడు.



Next Story

Most Viewed