కోచ్‌లకు బాధ్యత లేదా?.. బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణెపై అశ్విని ఫైర్

by Harish |
కోచ్‌లకు బాధ్యత లేదా?.. బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణెపై అశ్విని ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు ఒక్క పతకమూ దక్కలేదు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ ఓటమి అనంతరం భారత షట్లర్ల ప్రదర్శనపై బ్యాడ్మింటన్ కోచ్ ప్రకాశ్ పదుకొణె అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు మరింత బాధ్యతగా, జవాబుదారీతనంగా ఉండాల్సిందని, వారికి లభించిన మద్దతుతో ఫలితాలు ఇవ్వడం నేర్చుకోవాలని వ్యాఖ్యానించాడు. ప్రకాశ్ పదుకొణె వ్యాఖ్యలపై భారత బ్యాడ్మింటన్ బృందంలోని డబుల్స్ షట్లర్ అశ్విని పొన్నప్ప ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించింది.

ఆటగాళ్ల విజయాలకు క్రెడిట్ తీసుకునే వారు, ఓటములకు మాత్రం ప్లేయర్లు బాధ్యత వహించాలా? అంటూ ప్రశ్నించారు. ‘ఆ వ్యాఖ్యలు బాధకలిగించాయి. ప్లేయర్ గెలిస్తే ప్రతి ఒక్కరూ క్రెడిట్ తీసుకోవడానికి చూస్తారు. అదే ఓడిపోతే మాత్రం ఆటగాళ్ల తప్పా?. సన్నద్ధత లేకపోవడం, ఆటగాళ్లను సిద్ధం చేయడం వంటి వాటిపై కోచ్‌లు ఎందుకు బాధ్యత తీసుకోరు?. గెలిస్తే ముందుగా క్రెడిట్ తీసుకునేది వారే. అలాగే, తమ ఆటగాళ్ల ఓటమి కూడా ఎందుకు బాధ్యత వహించరు?. మొత్తంగా విజయమైనా, ఓటమైనా అది జట్టు బాధ్యత. ఆటగాడిపై నిందలు వేయడం సరైంది కాదు.’ అని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. కాగా, 2012 ఒలింపిక్స్ తర్వాత బ్యాడ్మింటన్‌లో భారత్ పతకం గెలవకపోవడం ఇదే తొలిసారి.

Advertisement

Next Story