షమీకి అర్జున అవార్డు ప్రదానం

by samatah |   ( Updated:2024-01-09 07:33:17.0  )
షమీకి అర్జున అవార్డు ప్రదానం
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అర్జున పురస్కారం అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన జాతీయ క్రీడా పురస్కారాల కార్యక్రమంలో భాగంగా షమీకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అవార్డును ప్రదానం చేశారు. గతేడాది జరిగిన ప్రపంచ కప్‌లో 7మ్యాచుల్లోనే 24 వికెట్లు తీసిన షమీ అద్బుతమైన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ సిఫార్సు మేరకు కేంద్రం షమీకి అర్జున అవార్డు ప్రకటించింది. 2023కు గాను మొత్తం 26మంది అర్జున అవార్డు స్వీకరించగా అందులో షమీ మాత్రమే క్రికెటర్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ..‘ఇది నా జీవితంలో సాధించిన అతిపెద్ద విజయం. ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. నా కలను సాకారం చేసుకోవడానికి కుటుంబం నాకు అందించిన సహకారం చాలా అద్భుతం’ అని తెలిపారు. కాగా, అర్జున అవార్డు దేశంలోనే రెండో అత్యున్నత క్రీడా పురస్కారం.

Advertisement

Next Story