ధోనీ లేకపోవడం వల్లే స్నిన్నర్లు రాణించడం లేదంటా!

by Anukaran |   ( Updated:2020-12-10 02:27:33.0  )
ధోనీ లేకపోవడం వల్లే స్నిన్నర్లు రాణించడం లేదంటా!
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో లేకపోవడం వల్లే భారత స్పిన్నర్లు ఇబ్బంది పడుతున్నారా? ఒక కెప్టెన్ లేనంత మాత్రాన స్పిన్నర్లు తమ ప్రతిభను కోల్పోతారా? తమంత తాముగా స్పిన్నర్లు బౌలింగ్ చేయలేరా? అంతర్జాతీయ అనుభవం లేని నటరాజన్ వికెట్లు తీస్తుంటే.. అతడి కంటే సీనియర్లు అయిన కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా మాత్రం వికెట్లు తీయడానికి అష్టకష్టాలు ఎందుకు పడుతున్నారు? అవును.. వారికి సరైన సమయంలో సలహాలు అందకపోవడం వల్లే విఫలం చెందుతున్నారని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే అంటున్నాడు.

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ మాత్రమే కాక ఒక మంచి వికెట్ కీపర్. పిచ్ పరిస్థితిని అంచనా వేయడంలో అతడికి అతడే సాటి. వికెట్ల వెనుక నిలబడి బ్యాట్స్‌మాన్ మానసిక స్థితిని కూడా చదివేస్తాడు. అందుకే తాను వికెట్ కీపర్‌గా ఉన్నంత కాలం బౌలర్లకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చేవాడు. కుల్దీప్, జడేజా, చాహల్ ఇలా సలహాలు తీసుకొని వికెట్లు తీసుకున్న సందర్భాలు మనం ఎన్నో చూశాం. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత టీమ్ ఇండియా వెళ్లిన మొదటి పర్యటనలోనే స్పిన్నర్లు తేలిపోయారు.

కుల్దీప్ ఆడిన ఓకే వన్డేలో 1 వికెట్ తీసి 57 పరుగులు ఇచ్చాడు. ఇక చాహల్ అయితే వన్డేల్లో 1/89, 0/70.. టీ20ల్లో 1/51, 0/41గా వారి గణాంకాలు ఉన్నాయంటే వారి ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్పిన్నర్లకు సరైన సమయంలో సలహాలు ఇవ్వడానికి కొన్ని సార్లు కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. ఏక్కడో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండటంతో సరైన సమయంలో స్నిన్నర్లతో మాట్లాడే అవకాశం ఉండటం లేదు. కోహ్లీ షార్ట్ ఎక్స్‌ట్రా కవర్ లేదా మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తే బౌలర్లతో తరచూ మాట్లాడుతూ.. సరైన సలహాలు ఇవ్వొచ్చని సీనియర్లు అంటున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ ఉన్నంత కాలం ఈ సమస్య ఎదురు కాలేదు. కానీ వికెట్ల వెనుక ధోనీ లేకపోవడంతో ఆ ప్రభావం స్నిన్నర్లపై పడిందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed