- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎందుకంత సీక్రెట్ జగన్ గారూ…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన తరువాత ఇప్పటి వరకు ఏడు సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులను కలిశారు. ఎన్నిసార్లు కలిసినా వారితో ఈ అంశాలపై చర్చించామన్న వివరాలను మాత్రం బయటకి పొక్కనీయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. దీంతో ఆయనపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలను ఎందుకు అంత సీక్రెట్‌గా ఉంచుతున్నారు. రాజధాని పర్యటన ఆయన వ్యక్తిగత పర్యటనా? లేక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా? అంటూ టీడీపీ నిలదీస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సిన జగన్.. తన కేసుల మాఫీ కోసం ఢిల్లీ పర్యటనను వాడుకుంటున్నారా? అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అసలింతకీ జగన్ పర్యటన వెనుక పరమార్థమేంటి? బీజేపీ నేతలు ఆయనను ఆహ్వానించారా? ఆయనే వారిని కలిసేందుకు వెళ్లారా? కోర్టు కేసులు మాఫీ కోసం వెళ్లారా? ప్రాజెక్టులు, నిధులు తెచ్చేందుకు వెళ్లారా? ఇంతకీ ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని టీడీపీ నేతలు అడుగుతున్నారు. తాజాగా జరిగిన పర్యటన శాసనమండలి రద్దు గురించి జరిగిందన్న ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ప్రధానితో ఎంతసేపు మాట్లాడారు? ఏఏ అంశాలపై మాట్లాడారు? రాష్ట్రానికి అదనపు నిధులేమి తెచ్చారు? అంటూ నిలదీస్తున్నారు. ఇదే సమయంలో సొంత పార్టీ నేతలకు కూడా సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు తెలియకపోవడంతో దానిగురించి ఎవరైనా ప్రశ్నిస్తే తెల్లమొహం వేస్తున్నారు. సీఎం పర్యటన వివరాలతో తమకు పనిలేదని మరికొందరు పేర్కొంటున్నారు.. ఈ క్రమంలో జగన్ పర్యటనను అంత రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారన్నది ఆసక్తిరేపుతోంది.