వన్ మ్యాన్ ఆర్మీకి పదేళ్లు

by  |
వన్ మ్యాన్ ఆర్మీకి పదేళ్లు
X

వన్ మ్యాన్ ఆర్మీకి నేటికి పదేళ్లు… రాజకీయాల్లోకి యువరాజుగా ఎంట్రీ ఇచ్చి, మా ముఖ్యమంత్రి అని మంత్రి వర్గంతో అనిపించుకుని, రోజులు తిరక్కుండానే పూలమ్మిన చోటే కట్టెలమ్మకున్న చందాన జేజేలు కొట్టిన వారే అవినీతిపరుడని, లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని అవమానించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పెట్టి, ఊహించని విధంగా జైలుపాలై విమర్శలు, ఎద్దేవాలు, అవహేళనలు అన్నీ భరించి పడిలేచిన కెరటంలా పదేళ్లు తిరక్కుండానే అధికారంలోకి వచ్చిన వన్ మ్యాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

1972 డిసెంబర్ 21న కడపజిల్లా జమ్మలమడుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మించారు. 1996లో భారతిని వివాహం చేసుకున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి, రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. 2009లో రాజశేఖరరెడ్డి మరణానంతరం ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో సీఎం అభ్యర్థిగా కేబినెట్ సంతకాలతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పిలిపించుకుని, హైకమాండ్ నిర్ణయంతో నిరాశచెందాడు. ఓదార్పు యాత్ర ఆరంభించి, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చి 2011 మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) పెట్టి ఓదార్పు యాత్ర కొనసాగించాడు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది.

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? అన్న చందాన మనీ ల్యాండరింగ్ పేరిట ఈడీ దాడులు చేసింది. వేల కోట్ల అవినీతి ఆరోపణలతో జగన్ జైలుపాలయ్యాడు. నేటితో 9 సంవత్సరాలు నిండి 10వ వసంతంలోకి అడుగిడనుంది. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరిపేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసిన వ్యక్తిగా వైఎస్సార్‌కి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయనకు భారీ స్థాయిలో అభిమానులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై అభిమానంతో ఆయన పేరులోని ఇంగ్లీషు అక్షరాలు కలిసి వచ్చేలా కే.శివకుమార్ అనే వ్యక్తి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని రిజిస్టర్ చేయించుకున్నారు. తన తండ్రి పేరిట పార్టీ స్థాపించాల్న ఆలోచనలో ఉన్న జగన్ తొలుత ఆ పార్టీలో చేరి, దానికి అధినేతగా మారారు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో జగన్ ఓటమిపాలైనా.. అలుపెరగక 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేపట్టి ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నారు.

2019లో జరిగిన ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పలు సంక్షేమ కార్యక్రమాలతో తండ్రికి తగ్గ తనయుడనిపించుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ ప్రధాన వేడుకలను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్టణంలో నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

tags : ysrcp, jagan, rajasekhara reddy, vijayamma, visakhapatnam



Next Story