నూతన సంవత్సర వేడుకలే టార్గెట్… స్పెషల్ పోలీసుల ఫోక‌స్‌

by Shyam |   ( Updated:2021-12-26 07:41:45.0  )
new year
X

న్యూ ఇయ‌ర్ వేడుక‌లే టార్గెట్‌గా భారీ స్థాయిలో గంజాయి, డ్ర‌గ్స్ వంటి మాద‌క‌ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రాకు స్మగ్లర్లు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా పోలీసులు గుర్తించారు. న‌యా జోష్‌లో యువ‌త‌ను ఉర్రూత‌లు ఊగించేందుకు ఇప్ప‌టి నుంచే మాద‌క‌ద్ర‌వ్యాల త‌యారీ, దిగుమ‌తి, స‌ర‌ఫ‌రాకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో స్మ‌గ్ల‌ర్‌ల ఆట క‌ట్టించేందుకు పోలీసులు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌కు సిద్ద‌మ‌య్యారు. ఇతర ప్రాంతాల నుంచి స్మ‌గ్లర్స్ గంజాయి, డ్ర‌గ్స్ వంటివి న‌గ‌రంలోకి తీసుకురాకుండ కట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే రంగంలోకి దిగిన పోలీసులు న‌గ‌రంలో గంజాయి నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక త‌నిఖీలు చేస్తున్నారు.

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : గంజాయి, డ్ర‌గ్స్ దందాను క‌ట్ట‌డి చేసేందుకు రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ ఎస్వోటీ (స్పెష‌ల్ ఆప‌రేష‌న్స్ టీమ్) ఏర్పాటు చేశారు. ఎస్వోటీ డీసీపీ జే.సురేంద‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తున్న ప్ర‌త్యేక ఎస్వోటీ పోలీసు బృందం ప్ర‌తి ప్రాంతాన్ని జ‌ల్లెడ‌ప‌డుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు విస్తృతంగా దాడులు చేస్తూ స్మ‌గ్ల‌ర్‌ల ఆట‌క‌ట్టిస్తున్నారు. ఈ ఏడాది 86 కేసుల్లో 5,750 కేజీల గంజాయి, 7 లీట‌ర్ల హ‌షీష్ ఆయిల్‌, 400 కేజీల న‌ల్ల‌మందు, స్వాధీనం చేసుకున్నారు. 41 మంది డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌ను అదుపులోకి తీసుకుని కేసులు న‌మోదు చేశారు.,

నేర‌స్తుల‌పై పీడీ యాక్ట్

గంజాయి, డ్ర‌గ్స్, ఇతర మాద‌క ద్ర‌వ్యాలు ఏవైనా త‌యారు చేసినా, స్మ‌గ్లింగ్ చేస్తూ ప‌ట్టుబడ్డ నిందితుల‌పై ఉక్కుపాదం మోపాల‌నీ రాచ‌కొండ సీపీ నిర్ణ‌యించారు. నేర‌స్థులను క‌ట‌క‌టాల్లోకి నెట్టిన వెంట‌నే వారిపై పీడీయాక్డ్ న‌మోదు చేయాల‌ని డీసీపీ, ఎసీపీల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే 12 మంది స్మ‌గ్ల‌ర్‌ల‌పై రాచాకొండ సీపీ మ‌హేష్‌భ‌గ‌వ‌త్ పీడీయాక్డ్ న‌మోదు చేశారు.

గంజాయి, డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదం

కొంత‌మంది స్మ‌గ్ల‌ర్‌లు ఎపిడ్రిన్‌, మెఫిడ్రిన్‌, అల్ఫాజోలం వంటి కొన్ని ర‌కాల మాద‌క ద్ర‌వ్యాల‌ను న‌గ‌ర శివారు ప్రాంతాల‌లో త‌యారు చేస్తున్న‌ట్లు గ‌తంలో వెలుగులోకి వ‌చ్చాయి. ముంబై నుంచి న‌గ‌రానికి వ‌చ్చిన పోలీసుల‌తో పాటు డీఆర్ఐ అధికారులు దాడులు చేసి కోట్ల రూపాయ‌ల విలువైన మాద‌క ద్ర‌వ్యాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవ‌ల ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూక‌ట్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్ ప్రాంతంలో 2 కోట్ల విలువైన మెఫిడ్రిన్ మాద‌కద్ర‌వ్యాల‌ను ప‌ట్ట‌కున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఇ్ప‌టికే ప‌లువురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మాద‌క ద్ర‌వ్యాల ఫార్ములా తెలిసిన కెమిస్టులు, డ్ర‌గ్గిస్టులు, ఫార్మాసిస్టుల‌తో స్మ‌గ్ల‌ర్‌లు ఈ మాద‌క ద్ర‌వ్యాల‌ను త‌యారు చేసి ఇత‌ర రాష్ట్రాల‌కు ఎగుమ‌తి చేస్తున్నారు. అలాగే న‌గ‌రంలోని ప‌లు ప‌బ్‌లు, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు నిర్వ‌హించే రేవ్ పార్టీల నిర్వాహ‌కుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ నేప‌థ్యంలో శివారు ప్రాంతాల‌లో మూత‌బ‌డిన ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు, గోదాముల‌పై పోలీసులు నిఘా పెట్టారు. పాత అనుభ‌వాల‌ను, గంజాయి, డ్ర‌గ్స్ హాట్ స్పాట్‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ప్ర‌త్యేక ఆప‌రేష‌న్స్ టీమ్ (ఎస్వోటీ) న్యూయ‌ర్ వేడుక‌ల్లో మాద‌క ద్ర‌వ్యాల వినియోగాన్ని నియంత్రించ‌డ‌మే ల‌క్ష్యంగా దాడులు నిర్వ‌హిస్తుంది. గంజాయి, డ్ర‌గ్స్ స్మ‌గ్ల‌ర్‌ల ఆట‌క‌ట్టించేంచ‌డానికి ఎల్బీన‌గ‌ర్‌, మ‌ల్కాజ్‌గిరి, భువ‌న‌గిరి జోన్‌ల టీమ్‌లు సైతం రంగంలోగి దిగాయి.

Advertisement

Next Story

Most Viewed