ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూత

by Anukaran |   ( Updated:2023-10-04 13:09:49.0  )
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (74) కన్నుమూశారు. కరోనా పాజిటివ్‌తో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఆయన ఇటీవలే కోలుకొని.. మళ్లీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇదేక్రమంలో శుక్రవారం ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1946, జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించిన బాల సుబ్రహ్మణ్యంకు సతీమణి సావిత్రి, కుమారుడు చరణ్, కూతురు పల్లవి ఉన్నారు. 1965నుంచి సినిమాల్లో పాటలు పాడటం మొదలు పెట్టిన బాలు… తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఇప్పటివరకు 40వేలకు పైగా పాటలను తన మధరమైన గొంతుతో ప్రజలకు వినిపించారు.

తండ్రి కోరిక మేరకు మద్రాస్‌లో ఇంజినీరింగ్ కోర్సులో చేరిన బాలు.. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడి బహుమతులు గెలిచాడు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో గాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ పాటలు పాడారు. ఇదేక్రమంలో నటుల హావభావాలకు, నటనశైలికి అనుగుణంగా పాటలు పాడుతుండటంతో సినిమాలోని మొత్తం పాటలను దర్శక, నిర్మాతలు బాలుకే అప్పగించేవారు. 1969లో తొలిసారి నటుడిగా కనిపించిన ఆయన ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమికుడు, పవిత్ర బంధం, ఆరోప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళీ భవతో పాటు మరెన్నో చిత్రాల్లో నటించారు.

ఆరు జాతీయ అవార్డులు

తన సినీ ప్రస్థానంలో 6 జాతీయ అవార్డులతో పాటు, 6 ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది పురస్కారాలు అందుకున్నారు.. 1979లో వచ్చిన మ్యూజికల్ హిట్ మూవీ శంకరాభరణానికి మొదటగా జాతీయ అవార్డు లభించింది. ఆ తర్వాత బాలీవుడ్‌‌లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి 1981లో రెండోసారి పురస్కారం అందుకున్నారు. సాగరసంగమం, రుద్రవీణ చిత్రాలకు కూడా నేషనల్ అవార్డులు అందుకున్నారు. 25సార్లు ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. అటు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల నుంచి సైతం పురస్కారాలు దక్కించుకున్నారు.

Advertisement

Next Story