3కంపెనీల విత్తనాలు ముంచినయ్.. మొలకెత్తని సోయా

by srinivas |
3కంపెనీల విత్తనాలు ముంచినయ్.. మొలకెత్తని సోయా
X

దిశ, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను సోయా నిండా ముంచింది. వానాకాలం పంటగా వేసిన సోయా విత్తనాలు జిల్లాలోని 22 వేల ఎకరాల్లో మొలకెత్తలేదు. సర్కారు నియంత్రిత పంటల సాగులో భాగంగా ఉమ్మడి జిల్లాలో వరి, మొక్కజొన్న స్థానంలో సోయా సాగు చేసుకోవాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో 2.9 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు అనుగుణంగా 144 సొసైటీల ద్వారా సబ్సిడీపై రూ.1,184కు 30 కిలోల సోయా విత్తనాల బస్తాలను రైతులకు అందించింది. కానీ, ఉమ్మడి జిల్లా రైతాంగానికి అవసరమయ్యే 60 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు సరఫరా చేయలేక పోయింది ప్రభుత్వం. దాంతో రైతులు రూ.3,000కు బస్తాను ప్రైవేట్ ఫర్టిలైజర్స్ షాపుల్లో కోనుగోలు చేశారు. సొసైటీ, ప్రైవేటు ఫర్టిలైజర్స్ ద్వారా కొనుగోలు చేసి వేసిన విత్తనాలు రెండూ మొలకెత్తకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై గత నెల నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఎంఏవోలు, ఏఈవోలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. నిజామాబాద్ జిల్లాలో 11 వేల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 11,200 ఎకరాల్లో సోయా విత్తనాలు మొలకెత్తలేదని తేల్చారు. ప్రైవేటు ఫర్టిలైజర్స్ నుంచి తెచ్చి వేసిన విత్తనాలు ఉమ్మడి జిల్లాలో 5 వేల ఎకరాల్లో మొలకెత్తలేదని రైతులు వాపోతున్నారు. మొత్తంగా రైతులకు విత్తనాల రూపంలో జరిగిన నష్టం రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వ్యవసాయ క్షేత్రాలను సాగుకు సన్నద్ధం చేయడానికి, వ్యవసాయ కూలీలకు వెచ్చించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకుంటే మరో కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు.

మూడు కంపెనీల విత్తనాలు మొలవలే..

సర్కారు సప్లై చేసిన వికేర్ అగ్రిటెక్ జేఎస్ 335, అక్షయ్ అగ్రిటెక్ జేఎస్ 335 అనే విత్తన కంపెనీల విత్తనాలు, మూడు ప్రైవేట్ కంపేనీల విత్తనాలు మొలకెత్తలేదు. కరోనా కారణంగా సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లలో విత్తనాలకు ప్రాసెసింగ్ సరిగా జరగలేదని, అందుకే అవి మొలకలు రాలేదని వ్యవసాయ శాస్ర్త‌వేత్తలు అంటున్నారు. సాధారణంగా సోయా విత్తనాల్లో మొలకలు రావడం 60 శాతానికి మించదు అని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, రైతులు సర్కారు సోయా వేయాలని చెప్పిందని, పైగా సబ్సిడీ కింద విత్తనాలు ఇస్తున్నదని తెలుసుకుని ఆ విత్తనాలు కొనుగోలు చేశారు. సొసైటీల్లో విత్తనాలు అయిపోవడంతో కొందరు ప్రైవేట్ కంపెనీలకు చెందిన విత్తనాలు కూడా రెండింతల ధరకు కొన్నారు. అయితే అవి కూడా మొలకెత్తకపోవడంతో నష్టపోయారు.

మాడిన విత్తనాలు..

నిజామాబాద్ జిల్లాలో కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వెల్పూర్, బాల్కోండ, బోధన్, రెంజల్ మండలాల్లో, కామారెడ్డి జిల్లాలో జుక్కల్, మద్నూర్, తాడ్వాయి, సదాశివ నగర్, గాంధారి, బిచ్కుంద మండలాల్లో వానాకాలంలో వేసిన సోయా విత్తనాలు మాడిపోయాయి. వానాకాలం సాగులో నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తారా అని వ్యవసాయ అధికారులను అడిగితే అది ప్రభుత్వ నిర్ణయం అని, తాము ఈ విషయంలో ఏమీ చెప్పలేమని అంటున్నారు. అయితే విత్తనాలు మొలకెత్తకపోవడంపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని సర్కారు ఆదేశించింది. వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపింది. దీంతో తమరే నష్టపరిహారం వస్తుందేమోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

నష్టపోయినం.. ఆదుకోండి

ప్రభుత్వం చెప్పినట్లు సోయా విత్తనాలు అలికినం. ఒక్క విత్తు కూడా మొలవలేదు. విత్తనాలకు, దున్నడానికి, కూలీలకు ఇచ్చిన డబ్బులు నష్టపోయినం. సోయా రైతులను ఆదుకుంటాం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హమీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు వచ్చి చూసి పోయారు. నష్ట పోయిన డబ్బుల గురించి మాత్రం అధికారులు ఇప్పుడేం చెప్పట్లేదు. -అశోక్ గౌడ్, హున్సాగ్రామం, బోధన్ మండలం

ఉచితంగా విత్తనాలు ఇవ్వాలి

సోయా విత్తనాలను మళ్లీ రైతులకు ఉచితంగా ఇవ్వాలి. వానాకాలం సీజన్‌లో విత్తడానికి అయిన ఖర్చు నష్టపోయాం. మళ్లీవిత్తడానికి, దుక్కి దున్నడానికి, విత్తనాలకు అదనంగా భారం పడుతుంది. కావున సోయా విత్తి నష్టపోయిన రైతులను సర్కారు ఆదుకోవాలి. మొలకెత్తని విత్తనాలిచ్చిన సంస్థలపై చర్యలు తీసుకోవాలి. -ప్రమోద్, బాబాపూర్ గ్రామం, భీంగల్ మండలం

Advertisement

Next Story

Most Viewed