కృత్రిమ సూర్యుడితో.. 10 కోట్ల డిగ్రీల వేడి

by Shyam |
కృత్రిమ సూర్యుడితో.. 10 కోట్ల డిగ్రీల వేడి
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా ఇటీవలే న్యూక్లియర్ ల్యాబ్‌లో ఓ కృత్రిమ సూర్యుడిని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిని ‘హెచ్ఎం2 టోకామర్ రియాక్టర్’ అని పిలుస్తుండగా.. ఇది సూర్యుడి కంటే అధిక శక్తిని, వేడిని విడుదల చేస్తుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఇప్పుడు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కూడా కేస్టార్(KSTAR) అనే కృత్రిమ సూర్యుడిని సృష్టించారు. అందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి ఏకంగా 10 కోట్ల డిగ్రీల వేడిని పుట్టించారు. నిజానికి సూర్యుడిలోని ఉష్ణోగ్రతలు 1.5 కోట్ల డిగ్రీలకు పరిమితం కాగా, కేస్టార్‌లో మాత్రం 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతలను 20 సెకన్ల పాటు కొనసాగించి దక్షిణి కొరియా శాస్ర్తవేత్తలు ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ, అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ ప్రయోగం చేపట్టగా, దక్షిణ కొరియాలోని ‘కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ’లో ఈ ప్రయోగం నిర్వహించారు. ఇంతకంటే ముందు 100 మిలియన్ డిగ్రీల వేడిని పుట్టించినా, 10 సెకన్ల కన్నా ఎక్కువ సమయం కొనసాగలేదు. దాంతో గత ప్రయత్నాలతో పోలిస్తే, ఇది గణనీయమైన మెరుగుదలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు దీనిని సాధించడానికి అవసరమైన సైంటిఫిక్ వర్క్ ఎంతో సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, పురోగతి స్థిరంగా ఉంది. కేస్టార్ 2018‌లో మొట్టమొదట సారిగా 100 మిలియన్-డిగ్రీల పరిమితిని దాటగా, 2019లో 8 సెకన్ల పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను కొనసాగించగలిగింది. ఇప్పుడు, అది రెట్టింపు కంటే ఎక్కువ సమయం కొనసాగిందని శాస్ర్తవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed