కరోనా భయం.. కన్నతల్లిని ఇంట్లోకి రానియ్యలే !

by  |
కరోనా భయం.. కన్నతల్లిని ఇంట్లోకి రానియ్యలే !
X

దిశ, క్రైమ్‌బ్యూరో: కన్నతల్లికి కరోనా తగ్గినా.. అనుమానంతో ఆమెను ఇంటిలోకే రానివ్వలేదు ఓ కొడుకు. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు జోక్యం చేసుకుని తల్లిని ఇంట్లోకి పంపారు. కానీ ఆ వ్యక్తి భయంతో.. భార్యా పిల్లలను తీసుకుని వేరేచోటికి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిల్మ్‌నగర్ బీజేఆర్‌నగర్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలికి 10రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చింది. అయితే తల్లికి వచ్చిన కరోనా తమకు వస్తుందేమోనన్న భయంతో ఆమెను సొంత కొడుకే ఇంట్లోకి రానివ్వలేదు.ఇదే క్రమంలో వృద్ధురాలి ఇంట్లోకి వస్తుందేమోనన్న అనుమానంతో ఆమె ఉండే రేకుల షెడ్డును ధ్వంసం చేశాడు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. కొడుకును స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. కొడుకు ఉండే గదిలోకే తల్లి శారదమ్మను పంపారు. కానీ కొద్దిసేపటికే భార్య, పిల్లలను వెంట పెట్టుకొని వేరే ఇంటికి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ జిల్లా లీగల్ అథారిటీ విభాగం న్యాయమూర్తి బాధితురాలిని పరామర్శించి, వివరాలను రికార్డు చేసుకున్నారు. అయితే లీగల్ అథారిటీ జడ్జి ఇచ్చే తీర్పుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపారు.


Next Story