బామ్మర్ది చావుకు వచ్చి అత్త తల పగులగొట్టిన అల్లుడు.. అంతటితో ఆగకుండా..!

by Sumithra |
బామ్మర్ది చావుకు వచ్చి అత్త తల పగులగొట్టిన అల్లుడు.. అంతటితో ఆగకుండా..!
X

దిశ, కామారెడ్డి : బామ్మర్ది చనిపోయాడని అత్తింటికి వచ్చాడు అల్లుడు. అంత్యక్రియలు అయిపోయినా ఇక్కడే ఉన్నాడు. అత్త వద్ద డబ్బులు ఉన్నాయని గమనించిన అల్లుడు వాటిని కాజేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూశాడు. అదును చూసి అత్తపై దాడి చేసి డబ్బులు తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షేర్ గల్లీలో మంగళవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని షేర్ గల్లీలో నివాసముండే లక్ష్మి కుమారుడు అనారోగ్యంతో దసరా పండగ రోజున మృతిచెందాడు.

అంత్యక్రియలకు వచ్చిన అల్లుడు సాయిలు అత్త ఇంటి వద్దనే ఉన్నాడు. అత్త వద్ద డబ్బులు ఉన్నాయని అతనికి తెలియడంతో వాటిని కాజేసేందుకు పన్నాగం పన్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉదయం అత్త లక్ష్మీపై గడ్డపారతో అల్లుడు దాడి చేయగా.. ఆమె తలకు, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి అరుపులతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, దాడి అనంతరం లక్ష్మీ వద్ద ఉన్న రూ.15 వేలతో పాటు ఇంటి తాళాలు తీసుకుని సాయిలు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story