కరోనాతో మృతులకు వీళ్లు అంత్యక్రియలు చేస్తున్రు

by Shyam |   ( Updated:2020-07-19 00:14:29.0  )
కరోనాతో మృతులకు వీళ్లు అంత్యక్రియలు చేస్తున్రు
X

దిశ, న్యూస్ బ్యూరో: సనాతన ధర్మం ప్రకారం మనిషి ఆఖరి యజ్ఞం అంత్యేష్ఠి సంస్కారం. అందుకే కొందరు యువకులు అంత్యక్రియలను ఓ యజ్ఞంలా స్వీకరించిండ్రు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి శవాలకు దహన సంస్కారాలు చేస్తుండ్రు. కొవిడ్-19 మానవ జీవితంలో తీవ్ర మార్పులను తీసుకొచ్చింది. పాజిటివ్ అంటే చాలు.. ఇంట్లో ఉండనిస్తలేరు. ఊర్లోకి రానిస్తలేరు. కాలనీలో అడుగు పెట్టొద్దంటున్నరు. కుటుంబ సభ్యులే దూరంగా ఉంటున్నరు. దురదృష్టవశాత్తు చనిపోతే ఆఖరి చూపులూ దక్కడం లేదు. సంప్రదాయ పద్ధతిన దహన సంస్కారాలు లేవు. పాడె మోసేందుకు ‘ఆ నలుగురు’ కనిపిస్తలేరు. కన్నతండ్రి చనిపోయినా కడసారి చూసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. అంత్యక్రియలకు సాహసం చేయడం లేదు. ఆఖరికి శ్మశానవాటికకు తీసుకొచ్చేందుకు కూడా ససేమిరా అంటున్నరు. పరామర్శలకు దూరంగా ఉంటున్నరు. ఇలాంటి సమయంలోనూ ఆ యువకులు ఆఖరి పయనంలో ఉన్నవారికి ఆత్మబంధువులవుతున్నరు. కనీసం శవాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడే సమాజానికి సవాల్ విసురుతున్నరు. శవాన్ని తరలించడంతోపాటు అన్ని బాధ్యతలను భుజాన వేసుకుంటున్నరు. సేవా దృక్పథాన్ని ప్రదర్శిస్తూ ప్రశంస లు పొందుతున్నరు. వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అంకితభావం, మానవత్వంతో శవాలను ఏ అర్ధరాత్రో దహనం చేస్తున్నరు. వారి సేవల్లోనూ సేవామూర్తిత్వం కనిపిస్తోంది. వారికి తోడుగా ఈ యువకులు ‘ఫీడ్ ద నీడీ’, ‘సర్వ్ నీడీ’ పేరిట మేమున్నామంటూ ముందుకు వస్తున్నరు.

యువత ఆలోచన

రమణ్ జిత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ స్నేహితుడి తల్లి చనిపోయింది. అంత్యక్రియలకు ఎవరూ సహకరించలేదు. హైటెక్స్ నుంచి ఈఎస్ఐ వరకు శవాన్ని తీసుకెళ్లడానికే రూ.20 వేలు ఖర్చయ్యింది. శ్మశానవాటికలోనూ రూ.25 వేలు ఖర్చయ్యింది. చనిపోయే ముందు చికిత్సకూ రూ.లక్షలు ఖర్చయ్యాయి. అంత్యక్రియలకూ పెద్ద మొత్తంలో భరించాలంటే ఎంత కష్టం? పైగా తోటివారు తోడుగానూ రావడం లేదు. అప్పుడే ‘ఫీడ్ నీడీ’ ఊపిరి పోసుకుంది. బెల్లం శ్రీనివాస్, రమణ్ జిత్ సింగ్, సాయితేజ, ప్రదీప్ గాడిచెర్ల సహా మరో ఆరుగురు ఈ సంస్థ ఏర్పాటుకు నడుం బిగించిండ్రు. వీళ్లంతా సాఫ్ట్వేర్ ఇంజినీర్లే. ప్రదీప్ స్నేహితుడు అమెరికాలో ఉంటారు. ఆయన తల్లిదండ్రులకు కరోనా సోకింది. తండ్రి చనిపోయారు. అంత్యక్రియలు చేసేందుకు కొడుకు రాలేని దుస్థితి. బంధువులు నో అన్నరు. ఈ విషయం ప్రదీప్ దృష్టికి రాగానే సభ్యులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడి నుంచి సేవ మొదలైంది. బీహెచ్ఈఎల్, కేపీహెచ్ బీ కాలనీవాసులకు భరోసానిచ్చిండ్రు. ఏ కారణంతో చనిపోయినా అంత్యక్రియలు నిర్వహిస్తున్నరు.

సొంతంగా అంబులెన్స్ కొనుగోలు

మృతదేహాల రవాణాకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదని సొంతంగా మారుతీ ఓమ్నీ వ్యానును కొనుగోలు చేసి అంబులెన్స్ గా మార్చిండ్రు. ఫోన్ రాగానే నలుగురు మేలు రకమైన పీపీఈ కిట్లను ధరిస్తున్నరు. అంబులెన్స్ లో మృతదేహాన్ని ఈఎస్ఐ శ్మశానవాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలను నిర్వర్తిస్తున్నరు. ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత వాహనాన్ని సోడియం హైపోక్లోరైడ్తో శానిటైజ్ చేస్తున్నరు. డ్రైవరు సీటుకు వెనక సీటుకు మధ్య ఫైబర్ షీట్లను ఉంచిండ్రు. కొద్ది రోజుల్లోనే వీళ్ల సేవకు మంచి గుర్తింపు లభించింది. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ప్రశంసలు కురిపిస్తున్నరు. వీళ్లు చేస్తున్న సాహసానికి వాళ్ల కుటుంబ సభ్యులు కూడా శభాష్ అంటున్నరు. అంతా ఉచితంగానే చేస్తుండడం గమనార్హం. అంత్యక్రియలు నిర్వర్తించిన తర్వాత డొనేషన్ ఇస్తే స్వీకరిస్తున్నరు. మార్చి 23 నుంచి వలస కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఆహార పదార్ధాల పంపిణీలోనూ ఈ ఆర్గనైజేషన్ ముందు వరుసలో ఉంది. ఐదు వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లు, ప్రతి రోజు 200 మందికి భోజనం పెట్టిండ్రు.

ఎవరూ లేకపోతే

మాదాపూర్ ఠాణా పరిధిలో ఓ పెద్దాయన చనిపోయిండు. కరోనా కారణం కాదు. కొడుకులు లేరు. ఆయనేం పేదవాడూ కాదు. బంధుమిత్రులంతా ఉన్నత విద్యావంతులు, పెద్ద ఉద్యోగాల్లోనే స్థిరపడ్డరు. అంతా చూసి కన్నీరు కార్చి వెళ్లిపోయిండ్రు. అంత్యక్రియలకు ఎవరూ రాలే. ‘సర్వ్ నీడీ’ ముందుకొచ్చింది. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఈ సంస్థ ద్వారా అనాథలుగా చనిపోయినవారికి, వృద్ధాశ్రమాల్లో చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నరు. పిండ ప్రదానం కూడా చేస్తున్నరు. కరోనా కష్టకాలంలోనే 30 మందికి అంత్యక్రియలు నిర్వహించిండ్రు. ఈ సంస్థలో మహిళలు కూడా ఉండడం విశేషం. అనాథలు చనిపోయినపుడు అధికారులు తమకు ఫోన్ చేస్తే కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నట్లు ఫౌండర్ గౌతం తెలిపారు. నాలుగేండ్లుగా అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను చేపట్టినమన్నరు. వీరు కూడా ఎన్నెన్నో ప్రశంసలను పొందిండ్రు.

ఖర్చులు భరించలేనివారి కోసమే: బెల్లం శ్రీనివాస్, ఫీడ్ ద నీడీ ప్రతినిధి

మా స్నేహితుడి బాధ నుంచే ఈ ఆలోచన వచ్చింది. ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నం. ఎన్నో కార్యక్రమాలతో వలస కార్మికులకు సాయం చేసిన అనుభవం ఉంది. మా గ్రూపులో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లే. అందుకే, ఉచితంగానే అంత్యక్రియలను నిర్వహిస్తున్నం. ఎంతో మంది ఫోన్లు చేస్తున్నరు. అందరూ క్వారంటైన్లో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా..ఆ పని మేం చేస్తున్నం. హోం ఐసోలేషన్లో ఉన్నవారికి ఆరోగ్య కిట్లు అందకపోతే మేం సాయం చేస్తున్నం. మాతో నలుగురికి మేలు కలిగితే చాలు. మా సేవ మాకు తృప్తినిస్తుంది. అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత, లేదా మా కార్యక్రమాలు నచ్చడం ద్వారా ఎవరైనా ఆర్గనైజేషన్ కు డొనేషన్లు ఇస్తే తీసుకుంటున్నం. ఇప్పటికే మేం సొంత ఖర్చులతో అంబులెన్స్ సిద్ధం చేసుకున్నం. పీపీఈ కిట్లు, మాస్క్ లకు కూడా బాగానే ఖర్చవుతుంది. రవాణా చార్జీలు కూడా మేమే భరిస్తున్నం. ఎవరైనా మాకు 84998 43545 నంబరుకు ఫోన్ చేయొచ్చు.

పీపీఈ కిట్లు ధరించి చేయొచ్చు: గౌతం, ఫౌండర్, సర్వ్ నీడ్

మేం నాలుగేండ్లుగా అనాథ శవాలకు దహన సంస్కారాలను నిర్వహిస్తున్నం. వారి సంప్రదాయాల ప్రకారమే పూర్తి చేస్తున్నం. సంప్రదాయబద్ధంగా పిండ ప్రదానం చేస్తున్నం. కరోనా కష్టకాలంలో ఏ కారణంతో చనిపోయినా అంత్యక్రియలకు ముందుకు రావడం లేదు. పీపీఈ కిట్లు ధరించి ప్రక్రియను పూర్తి చేయొచ్చు. జాగ్రత్తలు పాటించడం ద్వారా ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. మాకు పోలీసులు సమాచారం ఇచ్చినప్పుడు వెళ్తున్నం. అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఎవరైనా చనిపోయినప్పుడు మాకు ఫోన్లు చేస్తున్నరు. వెంటనే వెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నం. మా ఆర్గనైజేషన్ లో మహిళలు కూడా ఉన్నరు. ధైర్యంగా అంత్యక్రియల్లో పాల్గొంటరు. జాతి, కులం, లింగబేధం లేకుండా మేం మా సేవా కార్యక్రమాలను చేస్తున్నం.

Advertisement

Next Story

Most Viewed