టెన్నిస్‌లో పోలాండ్ క్రీడాకారిణి వరల్డ్ రికార్డ్

by Shyam |
టెన్నిస్‌లో పోలాండ్ క్రీడాకారిణి వరల్డ్ రికార్డ్
X

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్‌లో పోలాండ్ క్రీడాకారిణి ఇగా ష్వామ్‌టెక్ చరిత్ర సృష్టించింది. గురువారం రోలాంగ్ గారోస్‌లో జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఇగా ష్వామ్‌టెక్ 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో నదియ పొదొరోస్కాను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. 1939 తర్వాత (81 ఏళ్లు) ఒక పోలాండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 19 ఏళ్ల ష్వామ్‌టెక్ ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్స్‌కు చేరుకోవడం విశేషం. మ్యాచ్ అనంతరం ష్వామ్‌టెక్ మాట్లాడుతూ .. ‘ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మొదట్లో నేను ఇంత చక్కగా ఆడగలనని అనుకోలేదు. కానీ ఒక్కో మ్యాచ్ జరుగుతున్న కొద్దీ నాపై నాకు నమ్మకం వచ్చింది. ఏనాడైనా ఒక గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరుకుంటే అది కచ్చితంగా ఫ్రెంచ్ ఓపెన్ అని నాకు అనిపించేది. ఈ రోజు నా కల నిజమైంది.’ అని చెప్పింది.

పోరాడి ఓడిన క్విటోవా

ఫ్రెంచ్ ఓపెన్‌లో జరిగి మహిళా సింగిల్స్ రెండో సెమీస్‌లో అమెరికాకు చెందిన నాలుగో సీడ్ సోఫియా కెనిన్ 6-4, 7-5 తేడాతో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 7వ సీడ్ పెట్రా క్విటోవాపై విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెల్చుకున్న కెనిన్, ఎనిమిదేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ ఆడుతున్న క్విటోవాను తొలి సెట్‌లో అలవోకగా ఓడించింది. అయితే రెండో సెట్‌లో క్విటోవా చాలా పోరాడింది. క్విటోవా సర్వీస్‌లో మొదటి మ్యాచ్ పాయింట్ పోగొట్టుకున్న కెనిన్.. ఆ తర్వాత తన సర్వీస్‌లో మ్యాచ్ గెలుచుకుంది. క్విటోవా చివరి సెట్‌లో పోరాడినా చివరకు కెనిన్ ముందు తలవొంచక తప్పలేదు. శనివారం రోలాండ్ గారోస్‌లో జరిగే ఫైనల్స్‌లో కెనిన్, ష్వామ్‌టెక్ తలపడనున్నారు. కెనిన్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే 2016 తర్వాత ఒకే సీజన్‌లో రెండు టైటిల్స్ గెలిచిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించనుంది.

Advertisement

Next Story

Most Viewed