డిమాండ్ ఉంది కానీ,.. అమ్మలేదు!

by  |
డిమాండ్ ఉంది కానీ,.. అమ్మలేదు!
X

దిశ, వెబ్‌డెస్క్: డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ సరఫరా వ్యవస్థ మందగమనం కారణంగా జులైలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు క్షీణించాయి. ఉత్పత్తి ఆలస్యమవడం, దిగుమతుల్లో అవరోధాల కారణంగా అమ్మకాలు ప్రస్తుత నెలలో 30 నుంచి 40 శాతం తగ్గాయి. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య ఓడరేవుల్లో చైనా నుంచి సరుకుల దిగుమతికి కఠినమైన తనిఖీలతో జూన్ చివరలో స్మార్ట్‌ఫోన్, విడి భాగాల ఆలస్యానికి కారణమయ్యాయి. దాదాపు అన్ని బ్రాండ్‌లకు ఈ కొరత ఏర్పడింది. కరోనా వైరస్ లాక్‌డౌన్, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు, సరిహద్దు ఉద్రిక్తతల మధ్య స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు తగ్గుతాయని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ట్రాకర్స్ ఇదివరకే అంచనా వేశాయి. రాబోయే రోజుల్లో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ ఇది కొనసాగవచ్చని ఓ నివేదిక అభిప్రాయపడింది. భారత్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో చైనాకు చెందిన జియోమీ, వీవో, రియల్‌మీ, ఒప్పో బ్రాండ్‌లే మార్చితో ముగిసిన త్రైమాసికంలో దాదాపు 3.2 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను రవాణా చేసి మార్కెట్లో 76 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వీటి తర్వాత మూడో స్థానంలో 15.6 శాతం రవాణాతో శాంసంగ్ ఉంది. 2019లో మొత్తం 15.2 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ల రవాణాతో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కలిగి ఉంది.


Next Story