భారత్ తక్కువ టెస్టులు చేస్తుందనడం తగదు : ఐసీఎంఆర్

by vinod kumar |
భారత్ తక్కువ టెస్టులు చేస్తుందనడం తగదు : ఐసీఎంఆర్
X

న్యూఢిల్లీ : భారత్ తక్కువ టెస్టులు చేస్తుందనడం తగదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వ్యాఖ్యానించింది. భారత్ ఒక్క కరోనా పాజిటివ్ కేసుకు 24 టెస్టుల చొప్పున నిర్వహిస్తున్నదని వెల్లడించింది. జపాన్ ఒక్క కేసుకు 11.7 మందికి, ఇటలీ 6.7 మందికి, యూఎస్ 5.3, యూకే 3.4 మందికి టెస్టులు నిర్వహించాయని తెలిపింది. ఇక్కడ మనం ప్రతి ఒక్క పాజిటివ్ కేసుకు 24 మంది చొప్పున కరోనా టెస్టులు జరుపుతున్నామని చెప్పింది. కాబట్టి భారత్‌లో టెస్టులు తక్కువ చేస్తున్నారనడం సరికాదని ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ ఆర్ఆర్ గంగఖేద్కర్ తెలిపారు. ఈ రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ.. కరోనాపై పోరుకు టెస్టింగ్ సమర్థవంతమైన ఆయుధని చెప్పారు. కానీ, భారత్ అతి స్వల్పంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నదని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు స్పష్టతనివ్వడం గమనార్హం.

భారత్‌కు 5 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు :

చైనా నుంచి ఐదు లక్షల ర్యాపిడ్ కొవిడ్ 19 టెస్టింగ్ కిట్లు మంగళవారం భారత్‌కు చేరాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎంతో కీలకమైన సమయంలో ఎదురుచూస్తున్నట్టుగానే ఈ కిట్లు చేరాయని తెలిపింది. అయితే, ఈ కిట్ల నైపుణ్యంపై సందేహాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డాక్టర్ గంగఖేద్కర్ మాట్లాడుతూ.. వీటిని కేవలం సర్వేలెన్స్, పర్యవేక్షణకే వినియోగిస్తాం కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కిట్ల సామర్థ్యాలపైనా అనుమానాలు అక్కర్లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,90,401 నమూనాలను పరీక్షించామని తెలిపారు. గడిచిన 24 గంటల్లోనే 30,043 శాంపిళ్లను టెస్టు చేశామని వెల్లడించారు.

Tags:coronavirus, testing, less, testing rate, icmr, rapid kits, china

Advertisement

Next Story

Most Viewed