రంగు.. పడింది!

by Anukaran |
రంగు.. పడింది!
X

రంగు.. ప్రపంచంలో దీనికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఒక వ్యక్తి ఎంత సమర్థుడైనా కానివ్వండి.. అతని శరీర రంగుని చూసి జడ్జ్ చేసే వాళ్లు చాలా మంది ఉంటారు. పాశ్చాత్య దేశాల్లో అది నలుపు, తెలుపుల మధ్య పెద్ద యుద్ధాన్నే సృష్టిస్తోంది. అయితే భారతదేశంలో నలుపు, తెలుపు రంగులంటూ ప్రత్యేకంగా ఏం లేవు. ఇక్కడి మతాల్లాగే రంగులు కూడా చిన్న చిన్న తేడాలతో చాలా వరకు ఉన్నాయి. పూర్తిగా నలుపు, చామనఛాయ, కొద్దిగా నలుపు, కొద్దిగా ఎరుపు, తెలుపు… ఇలా పెద్దమొత్తంలో చర్మరంగులు భారతీయుల్లో కనిపిస్తాయి. అందుకే రంగు అనకుండా కాంప్లెక్షన్ అని అంటుంటారు. ఈ శారీరక రంగే ఇప్పుడు ఎన్నో విప్లవాలకు దారితీస్తోంది. తక్కువ రంగు గల వారిని మంచి రంగు గల వారు తక్కువగా చేసి చూడటమే ఇందుకు ప్రధాన కారణం. ఇదంతా ప్రపంచం దృష్టిలో చూసినపుడు మనకు విధితమవుతుంది. కానీ భారతీయుల మనసుతో శారీరక రంగు వ్యక్తిత్వాలను, బంధాలను, బంధుత్వాలను కూడా నిర్ణయిస్తుంది. ఎలాగంటారా?

సమాజం సంఖ్యాపరంగా వృద్ధి చెందాలంటే వివాహం తప్పనిసరి. వివాహం చేసుకోవడానికి పాశ్చాత్య దేశాల్లో మనసులు కలిస్తే సరిపోతుంది. కానీ భారతదేశంలో శారీరక రంగులు కలవాలి. కలవాలి అనడం కంటే తక్కువ రంగు ఉన్న భర్తకి ఎక్కువ రంగు ఉన్న భార్య కావాలి. ఎక్కువ రంగు ఉన్న భర్తకి కూడా ఎక్కువ రంగు ఉన్న భార్యే కావాలి. మరి తక్కువ రంగున్న అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రేమ వివాహాలు, సామాజిక వివాహాలను పరిగణలోకి తీసుకోకపోయినా దాదాపు పెద్దవాళ్లు కుదిర్చే వివాహాలన్నింటిలో శారీరక రంగు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక్క ఉదాహరణతో చెప్పాలంటే.. ఇలాంటి శారీరక రంగు ప్రధాన కథాంశంగా కొనసాగుతోంది కాబట్టే ‘కార్తీక దీపం’ సీరియల్ అంతలా హిట్ అయింది.

సీరియల్ అంటే గుర్తొచ్చింది.. రంగు ఆధారంగా ఎన్నో సీరియళ్లు, సినిమాలు వచ్చాయి. వాటిలో కూడా తక్కువ రంగు ఉన్నవారి పట్ల వివక్ష చూపించడం, ఒకే తల్లిదండ్రులకు వేర్వేరు రంగుల్లో ఇద్దరు పిల్లలు పుట్టినపుడు, తక్కువ రంగు ఉన్నవాడు ఎంత మంచి వాడైనా, ఎక్కువ రంగు ఉన్నవాడు ఎంత చెడ్డవాడైనా వారిని పెంచడంలో తేడా కనిపించేది. ఇలాంటి కథాంశాలతో ఉన్న సినిమాలు, సీరియళ్లు హిట్ అవడం చూస్తుంటేనే మన వివాహ వ్యవస్థలో శారీరక రంగు ఎంత లోతుగా ఇమిడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

కానీ కాలం మారుతోంది..

వారం రోజుల్లో తెల్లని నిగారింపు పొందండి అంటూ రూ. 5 విలువ గల ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను రూ. 5 కోట్లు ఖర్చు చేసి ప్రకటనల తీసి అమ్ముతుంటారు. సగటు భారతీయుడిలో శారీరక రంగుని గురించిన అభిప్రాయం కారణంగానే ఈ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఫెయిర్‌నెస్ క్రీములను ఎండోర్స్ చేయడానికి చాలా మంది తారలు ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎండోర్స్ చేస్తే అభిమానుల నుంచి సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఒప్పుకోవడం లేదు. ఇలా ఒక్కొక్కటిగా రంగు కారణంగా వస్తున్న వివక్షలు కాల గర్భంలో కలిసిపోతున్నాయి. అందుకు షాదీ.కామ్ వారి సంఘటననే మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పెళ్లి అనగానే కట్నం తక్కువైనా పర్లేదు.. అమ్మాయి తెల్లగా ఉండాలనే చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. అందుకే మ్యాట్రిమొనీ వెబ్‌సైట్ షాదీ.కామ్ ఒక ఆప్షన్ పెట్టింది. ఈ ఆప్షన్ ద్వారా శారీరక రంగు ఆధారంగా ప్రొఫైళ్లను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది చూసి నివ్వెరపోయిన హేతల్ లఖానీ అనే మహిళ ఒక ఆన్‌లైన్ పిటిషన్ వేసింది. అంతే ఈ పిటిషన్‌కు విపరీతమైన ప్రోత్సాహం రావడంతో షాదీ.కామ్ వెనక్కి తగ్గింది. ఆ ఆప్షన్ ఊరికే పెట్టామని, దానితో పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రకటన చేసినప్పటికీ, దాన్ని తీసేవరకు ఈ మహిళాదండు ఊరుకోలేదు. అది తీసే వరకు పట్టుబట్టారు. దీంతో షాదీ.కామ్ ఆ ఫిల్టర్ ఆప్షన్ తీసేసింది. ఇలాంటి శారీరక రంగు ఆధార వివక్షలు పాశ్చాత్య దేశాల్లో బానిసత్వానికి ప్రతీకలు. అయితే, భారతదేశంలో మాత్రం సామాజిక అధమ స్థాయి ప్రవర్తనకు నిదర్శనాలుగా మిగిలాయి. ఇవి ఒక్కొక్కటిగా మాసిపోయి మనుషులంతా ఒకటే అనే రోజు రావాలని కోరుకుందాం!

Advertisement

Next Story

Most Viewed