యువకులతో మహిళ ఎఫైర్.. ఆరేళ్ల బాలిక హత్య

దిశ, వెబ్‌డెస్క్: పచ్చని సంసారంలో అక్రమ సంబంధం నిప్పులు పోసింది. భర్తకు తెలియకుండా ఇద్దరు యువకులతో ఎఫైర్ నడిపిన మహిళ కుటుంబాన్ని నాశనం చేసింది. కొన్నిరోజులుగా ఇంటికి సమీపంలోని యువకుడితో ఇటీవల మరో యువకుడితో అక్రమ సంబంధాలు నడిపిస్తూ కూతురు హత్యకు కారణమైంది. తల్లి చేసిన నీచపు పనికి అభం శుభం తెలియని ఆరేళ్ల బాలిక అసువులు బాసింది. తల్లిదండ్రులు సైతం చేయెత్తి కొట్టకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ కనుపాపను… మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు గొంతుకోసి హత్య చేశాడు. కూతురే లోకంగా బతికిన ఆ చిన్నారి తండ్రికి.. తన భార్య అక్రమ సంబంధాల వ్యవహారం.. కూతురు ప్రాణం తీయడంతో తట్టుకోలేక పోతున్నాడు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడ విహారీ హోమ్స్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. దంపతులకు ఆరేళ్ల కూతురు ఆద్య ఉంది. భర్త రోజు డ్యూటీకి వెళ్తుండటంతో అనూష ఇంటి వద్దే ఉంటోంది. ఇదే క్రమంలో ఇంటికి సమీపంలోని రమేశ్ అనే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేనప్పుడు రమేశ్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఇలా కొద్దిరోజులుగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతూ వస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనూషకు ఇటీవల ఫేస్‌బుక్‌లో సికింద్రాబాద్ భవానీ నగర్‌కు చెందిన కరుణాకర్‌తో పరిచయం ఏర్పడింది. అతనితో కూడా ఎఫైర్‌ పెట్టుకొని కంటిన్యూ చేస్తూ వస్తోంది.

అయితే కొద్దిరోజులుగా కరుణాకర్‌ను దూరం పెట్టడంతో కోపం పెంచుకున్న అతను గురువారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో అనూష ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో అనూష, ఆమె కూతురు ఆద్య, రమేశ్‌ ఇంట్లో ఉన్నారు. కరుణాకర్‌ డోర్ కొట్టే సమయంలో గమనించిన అనూష.. రమేశ్‌ను బాత్‌రూంలో దాచిపెట్టింది. ఈ విషయాన్ని గమనించిన కరుణాకర్‌.. బాత్రూమ్‌లో ఉన్న వ్యక్తిని బయటకు రావాలని గట్టిగా అరిచాడు. బాత్‌రూమ్‌లో ఎవరూ లేరని అనూష గట్టిగా చెప్పడంతో కోపానికి గురైన కరుణాకర్… అనూష కూతురు ఆద్య గొంతుపై సర్జికల్ కత్తి పెట్టి బెదిరించాడు. అతన్ని బయటకు తీసుకురాకుంటే బాలికను చంపుతానని బెదిరించాడు. అయితే రమేశ్ బయటకు రాకపోవడంతో ఆద్యను కరుణాకర్ గొంతు కోశాడు. ఈ క్రమంలో బాలిక అరుపులు విన్న రమేశ్ బయటకు వచ్చేసరికి.. కరుణాకర్‌ అతనిపై దాడి చేయడంతో పారిపోయాడు. ఇంట్లో అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అనూష, కరుణాకర్‌ను అదుపులోకి తీసుకొని… ఆద్య తండ్రికి ఫోన్‌లో సమాచారం అందించారు.

Advertisement