కరోనా సోకి ప్రజాగాయకుడు మృతి

by Anukaran |
కరోనా సోకి ప్రజాగాయకుడు మృతి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ప్రజాగాయకుడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత సుద్ధాల నిస్సార్ కరోనా వైరస్ సోకి మరణించారు. ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణ జానపద సాంస్కృతిక రూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడి నిస్సార్. ఆయన పాడిన పండు వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయే అనే పాట తెలంగాణ ధూంధాం సభల్లో పెద్ద ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూనే నిసార్ తన పాటలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. పేద కుటుంబంలో పుట్టిన నిసార్ అనేక పోరాటలకు పాటల ప్రాణవాయువుగా నిలిచాడు. నిసార్ మృతిపై ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి స్పందిస్తూ.. కరోనా వైరస్ సోకిన నిస్సార్ చికిత్స కోసం అనేక ప్రైవేటు ఆస్పత్రులకు తిరిగినా.. ఎక్కడా చేర్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు గాంధీ ఆస్పత్రిలో చేరితే వెంటిలేటర్ సదుపాయం లేక తుది శ్వాస విడిచారంటూ ఆరోపించారు. ఈయూ నేతగా, రచయితగా, ప్రజానాట్యమండలి కార్యదర్శిగా నిస్సార్ అందించిన సేవలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed