సామాజిక దూరానికి డ్రోన్ల సాయం

by  |
సామాజిక దూరానికి డ్రోన్ల సాయం
X

కరోనా వ్యాపిస్తుందిరా బాబు.. కాస్త దూరంగా ఉండండి అని చెబితే ఎవరూ వినిపించుకోవడం లేదు. పైగా ఎన్నాళ్ల నుంచో ఎదురుచూసి ఇవాళే కలిసినట్లుగా ఫీల్ అవుతూ దగ్గర దగ్గరగా ఒకరి మీద ఒకరు చేతులేసుకుని మరీ నడుస్తున్నారు. ఎవరో వచ్చి గుర్తుచేస్తే గానీ సామాజిక దూరం పాటించడం లేదు. ఏమన్నా అంటే మాస్క్ వేసుకుంటున్నాం కదా.. ఎంత దగ్గరగా ఉన్నా మాకు కరోనా రాదులే! అంటూ దబాయిస్తున్నారు. ఇలాంటి వాళ్లందరికీ మాటిమాటికీ పక్కన ఉండి గుర్తుచేయడం కొద్దిగా కష్టమే. అందుకే సింగపూర్ దేశంలో ఆ పనిని డ్రోన్లు చేస్తున్నాయి. సామాజిక దూరం ఉందా లేదా అని మీది నుంచి గమనిస్తూ హెచ్చరించే రెండు డ్రోన్లను సింగపూర్ పోలీసులు రంగంలోకి దింపారు.

ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిరోబోటిక్స్ సంస్థ తయారుచేసిన ఈ డ్రోన్లు గుంపులుగా ఉన్న మనుషులను గుర్తించడమే కాకుండా ఆ ఫుటేజీని లైవ్‌గా పోలీసులకు పంపిస్తాయి. ఒక్కోటి పది కేజీల బరువున్న ఈ డ్రోన్లు ఎవరైనా గుంపులుగా కనిపించినా, సామాజిక దూరం పాటించకున్నా సైరన్ ఇస్తూ వెంటబడతాయని ఎయిరోబోటిక్స్ సీఈవో ర్యాన్ క్రాస్ అంటున్నారు. మూడున్నర నెలల పాటు ట్రయల్ వేసి ఆ పరీక్షలు విజయవంతమైన తర్వాత ఈ డ్రోన్లను పనిలోకి దింపారు. సింగపూర్ పోలీస్ ఫోర్స్ మొత్తం వైరస్ కట్టడి కోసం పనిచేస్తున్న సమయంలో ఇతర నేరాలు పెరిగిపోయాయి. దీంతో వాటికి సమయం వెచ్చించడం కుదరడం లేదు. అందుకే ఇలా డ్రోన్ల సాయంతో కాస్త పనిభారం తగ్గించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.


Next Story