రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ పెట్టుబడి 

by  |
రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ పెట్టుబడి 
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) అనుకున్నట్టుగానే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే టెలికాం విభాగం జియో (jio)లో పెట్టుబడుల ద్వారా రుణరహిత సంస్థగా మారింది. తాజాగా, కరోనా సంక్షోభం నేపథ్యంలో వేగంగా దూసుకెళ్తున్న ఈ-కామర్స్ విభాగంలోకి కూడా పెట్టుబడులను రాబడుతోంది.

ఇదివరకు జియోలో పెట్టుబడులను పెట్టిన సిల్వర్ లేక్ (silverlake) సంస్థే రిలయన్స్ (reliance) అనుబంధంగా ఉన్న రిలయన్స్ రిటైల్‌లో ఏకంగా రూ. 7,500 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. జియోలో పెట్టుబడులు పెట్టిన సంస్థలను రిటైల్‌లోనూ ఇన్వెస్ట్ చేయాలని ఆర్ఐఎల్ కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిల్వర్ లేక్ సంస్థ 1.75 శాతం వాటాను దక్కించుకుంది. సిల్వర్ లేక్ సంస్థ ఇదివరకు జియోలో రూ. 10,202 కోట్ల పెట్టుబడులు పెట్టింది.

తాజా ఒప్పందం ద్వారా రిలయన్స్ రిటైల్ విలువ రూ.4.21 లక్షల కోట్లకు చేరినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ రిటైల్‌లో మైనారిటీ వాటాను విక్రయించడం ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలని ఆర్ఐఎల్ అధినేత ముఖేశ్ అంబానీ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 10 శాతం వరకు వాటాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, సంస్థ వృద్ధి సాధించడానికి అవకాశాలను ఆర్ఐఎల్ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 12 వేల స్టోర్లు ఉన్నాయి. ‘సిల్వర్ లేక్‌తో తమ భాగస్వామ్యం మరింత బలంగా కొనసాగడం పట్ల ఆనందంగా ఉంది. రిటైల్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని, భారత రిటైల్‌లో సిల్వర్ లేక్ దార్శనికతతో విలువైన పాత్రను పోషిస్తోందని, దేశంలో ఉన్న చిన్న వర్తకులతో కలిసి కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ముఖేశ్ అంబానీ చెప్పారు.

Read Also…

‘VRO’ రద్దు.. టెన్షన్‌లో రైతులు?



Next Story

Most Viewed