పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదే!

by  |
పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదే!
X

దిశ, మెదక్: కరోనా పాజిటివ్ బాధితులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించిన కొవిడ్ ఆస్పత్రి పనితీరు ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అనే నానుడికి సరిగ్గా సరిపోతుంది. ఆస్పత్రిని ప్రారంభించి 24 గంటలు కూడా గడవక ముందే వైద్యుల సేవలు అందటం లేదని, కనీసం పారిశుద్ధ్య నిర్వహణ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా కొవిడ్ ఆస్పత్రి ప్రారంభమైంది. అదే రోజు రాత్రి కరోనా పాజిటివ్‌తో చికిత్స పోందుతూ ఓ వృద్ధుడు మృతి చెందాడు.

అతను జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. వృద్దుడి మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తోటి రోగులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్పత్రి నిర్వహణ తీరు అధ్వాన్నంగా మారింది. ప్రారంభించి 24గంటలు గడవక ముందే ఆస్పత్రిలో ఎక్కడికక్కడ చెత్త చెదారం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. పరిశుభ్రమైన వాతావరణంతో రోగులకు వైద్యం అందించి భరోసా నివ్వాల్సిన కొవిడ్ ఆస్పత్రి నిర్వాహణ ఇలా ఉండటం, కరోనాతో మృతిచెందిన వృద్ధుడి మృతదేహం గంటల తరబడి బెడ్ పైనే ఉండటంతో మిగతా రోగులు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొవిడ్ ఆస్పత్రి నిర్వహణ తీరు ఇలా ఉండటంపై పులువురు ఘాటు విమర్శలు చేస్తున్నారు.


Next Story

Most Viewed