కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఆదివారం కూడా హాజరవ్వాల్సిందే!

by Shyam |   ( Updated:2021-07-16 22:10:01.0  )
కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఆదివారం కూడా హాజరవ్వాల్సిందే!
X

దిశ ప్రతినిధి, మెదక్: రాష్ట్రంలోని ఏ జిల్లా అధికారులకు లేని బంపర్ ఆఫర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా..? సాధారణ సెలవు దినమైన ఆదివారం కూడా హాజరు కావాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదివారం సాధారణ సెలవని మనకు తెలిసిందే. కానీ, సిద్దిపేట జిల్లాలో ఇందుకు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జిల్లా అధికారులు ఆదివారం సైతం విధులకు హాజరు కావాల్సిందే. ఇందుకోసం ప్రత్యేక అటెండెన్స్ రిజిష్టర్ మెయింటెన్ చేయాలని మరీ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనిపై జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివారం కూడా ఫ్యామిలీతో ఉండకూడదా? అంటూ కలెక్టర్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కోరుకునేది ఒక్కటే.. సాధారణ రోజుల్లో ఉద్యోగానికి పరిమితమైన తాము ఆదివారం రోజున కుటుంబంతో గడపాలని భావిస్తుంటారు. ప్రతి శాఖలో కనీసం ఇద్దరు సిబ్బంది హాజరయ్యేలా చూడాలని, ఇందుకు టర్న్ డ్యూటీ అటెండెన్స్ రిజిష్టర్ ఉపయోగించాలని, ప్రతి అధికారి ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వరకు పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఐదు కానిది ఆఫీస్ నుండి బయటకు వెళ్లొద్దని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా హరితహారంలో నాటిన చెట్లను కాపాడే బాధ్యత ప్రతి అధికారి తీసుకోవాలని, ఆఫీసు వదిలి వెళ్లే సమయంలో క్రమం తప్పకుండా ఏసీలు, కంప్యూటర్లు బంద్ చేయాలని, కిటీకీలు, లైట్లు కూడా బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆదివారం హాజరవ్వాల్సిందేనా..

సిద్దిపేట జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆదివారం సైతం అధికారులు విధులకు హాజరవ్వాలి. అయితే, దీనిపై అధికారులు స్పందస్తూ అందరూ సెలవులో ఉంటే తాము ఉద్యోగం చేయాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరిలాగా మాకూ కుటుంబం ఉంది.. మాకు మా పిల్లలతో సరదాగా గడపాలని ఉంటుంది. కానీ, సిద్దిపేట కలెక్టర్ తీరుతో సెలవు దినమైన ఆదివారం ఒక్కరోజు కూడా కుటుంబానికి సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఆదివారం కూడా విధులకు హాజరవ్వాల్సిందేనా? అంటూ కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ తన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిల్లాలోని ఓ ఉద్యోగ సంఘం నాయకున్ని సంప్రదించగా.. ‘దిశ’తో తన ఆవేదన వెలికిబుచ్చాడు.

‘‘సీఎం సొంత జిల్లాలో పనిచేయాలని అందరూ అనుకుంటారు. కానీ సిద్దిపేటలో అందుకు భిన్నంగా సాగుతోంది. ఇప్పటికే తాము రాత్రింబవళ్లు పని చేస్తున్నాం. అయినా జిల్లా కలెక్టర్ ఆదివారం కూడా విధులకు రమ్మని చెప్పడం కరెక్ట్ కాదు. వారం రోజులు కుటుంబాన్ని వదిలి పనిచేస్తాం. ఒకరోజు కుటుంబానికి వెచ్చిస్తామంటే ఉన్న ఒక్క రోజుని కూడా కలెక్టర్ లాక్కున్నాడు. ఇక మేము ఫ్యామిలీతో గడిపేదెప్పుడు’’ అంటూ కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులని ఉపసంహరించుకోవాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ తన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed