శ్రీకాంత్ వాడ్.. మట్టిలో మాణిక్యాలకు అతడే గురువు

by Anukaran |   ( Updated:2021-03-23 13:42:34.0  )
శ్రీకాంత్ వాడ్.. మట్టిలో మాణిక్యాలకు అతడే గురువు
X

దిశ, ఫీచర్స్ : బ్యాడ్మింటన్ క్రీడలో ‘సైనా నెహ్వాల్’ ఓ ఐకాన్. 2012 ఒలింపిక్ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా నిలిచింది. బ్యాడ్మింటన్ కోర్టులో ఆమె సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడిని ఉప్పొంగేలా చేశాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఎంతోమంది భారతీయ బాలికలు బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తినిచ్చిన ఈ లెజెండరీ బ్యాడ్మింటన్ స్టార్ జీవితకథ ఆధారంగా ‘సైనా – యాన్ ఇన్‌క్రెడిబుల్ ట్రూ స్టోరీ’ అనే మూవీ తెరకెక్కుతోంది. పరిణీతి చోప్రా లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే సైనాగా మేకోవర్ అయ్యేందుకు పరిణీతి ఎంతగా శ్రమించిందో, ఆమెను పర్‌ఫెక్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌‌గా తీర్చిదిద్దేందుకు కోచ్ శ్రీకాంత్ వాడ్ కూడా అంతే కష్టించాడు. ఒకప్పుడు సైనా నెహ్వాల్‌కు శిక్షణనిచ్చిన శ్రీకాంత్ వాడ్.. భారత్‌‌కు నైపుణ్యమున్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను అందిస్తున్నాడు. పేదరికం కారణంగా అవకాశాలు అందుకోలేకపోతున్న మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తూ.. రియల్ లైఫ్ హీరోగా నిలుస్తున్నాడు. ఆయన కోచింగ్ జర్నీపై స్టోరీ..

సైనా నెహ్వాల్ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి అప్లాజ్ అందుకుంది. స్క్రీన్ మీద పరిణీతిని చూసిన ప్రతి ఒక్కరూ నెహ్వాల్‌ను గుర్తుచేసిందని అభిప్రాయపడుతున్నారు. నిజానికి సాధారణ సినిమాలతో పోలిస్తే బయోపిక్‌‌లో నటించేందుకు చాలా వ్యత్యాసముంటుంది. రియల్ లైఫ్ స్టార్‌ను.. రీల్‌పై ప్రజెంట్ చేయడం కొంచెం కష్టమైన పనే. ఏ చిన్న తప్పు కనబడినా ప్రతి ఒక్కరూ కార్నర్ చేసే అవకాశం ఉంది. అందుకే మేకర్స్ చిన్న చిన్న విషయాల పట్ల కూడా స్పెషల్ కేర్ తీసుకుంటారు. లీడ్ రోల్‌ విషయంలో ఎక్కడా ఎగతాళి చేయకుండా, వారిని అనుకరించకుండా జాగ్రత్త వహించడం అవసరం. సైనా ట్రైలర్ చూస్తే మేకర్స్ పడిన కష్టమేంటో తెరమీద కనిపిస్తోంది. అందుకే పరిణీతి మేకోవర్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఆమె బాడీ లాంగ్వేజ్ , కోర్టులో ఆమె చూపించిన ఇంటెన్సిటీ, ఆమె రాకెట్ పట్టుకున్న విధానం, ఫుట్‌వర్క్.. యాజ్ ఈట్ ఈజ్ సైనాను తలపించింది. అయితే పరిణీతి ప్రతీ కదలిక, పాత్ర ప్రజెంటేషన్ వెనక ప్రధాన పాత్ర కోచ్ శ్రీకాంత్ వాడ్‌దే అని తెలుస్తుండగా, ఆయన భారతదేశపు తొలి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్) సర్టిఫికెట్ కోచ్‌ కావడం విశేషం.

32 సంవత్సరాలుగా..

శ్రీకాంత్ తన 32 ఏళ్ల వయసులో మూడంకెల జీతాన్ని వదులుకుని ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించాడు. మార్గదర్శకత్వం చేసేవాళ్లులేకనో లేదా గురువు లేనందు వల్లనో అప్పటికే చాలా ఆలస్యంగా బ్యాడ్మింటన్‌లోకి వచ్చిన శ్రీకాంత్.. ఆ తర్వాత కోచ్‌గా స్థిరపడటమే కాకుండా, కోచింగ్ ఫీజులు భరించలేని ప్రతిభావంతులైన పిల్లలకు ఉచితంగా శిక్షణనిచ్చాడు. ఈ క్రమంలోనే థానే బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభించాడు. అప్పటి నుంచి మూడు దశాబ్దాలుగా ఇండియాకు ఏస్ షట్లర్లను అందించడానికి, బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ పరంగా థానే జిల్లాను దేశంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా నిలిపేందుకు కృషి చేశాడు. ఈ క్రమంలో అతని వద్ద శిక్షణ పొందిన వేలాది మంది విద్యార్థులు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్నారు. వారిలో 1000కి పైగా విద్యార్థులు పేదరికం నుంచి వచ్చినవాళ్లే కాగా.. ఇప్పటి వరకు అతని విద్యార్థుల్లో 16 మంది జాతీయ చాంపియన్లు, 42 మంది అంతర్జాతీయ ఆటగాళ్ళు (నెహ్వాల్‌తో సహా) ఉన్నారు. ఇక వందలాది మంది రాష్ట్ర స్థాయిలో ఆడగా, ఎనిమిది మంది శివ ఛత్రపతి అవార్డులు అందుకున్నారు. ఈ మేరకు ప్రతిభావంతులైన పేద క్రీడాకారులకు ఉచిత శిక్షణనిచ్చి వారి జీవితాలను మార్చిన రియల్ లైఫ్ హీరోగా శ్రీకాంత్ నిలిచాడు.

60వ దశకంలో థానేలో బ్యాడ్మింటన్‌ శిక్షణకు మౌలిక సదుపాయాలు గానీ ప్రొఫెషనల్ కోచింగ్ సెంటర్లు గానీ లేవు. అయితే బ్యాడ్మింటన్ అంటే ఇష్టపడే శ్రీకాంత్.. ఉద్యోగం చేస్తూనే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో పాటియాలాలో కోచింగ్ కోర్సు పూర్తిచేసి 32 ఏళ్ళ వయసులో అధికారికంగా థానే బ్యాడ్మింటన్ అసోసియేషన్‌లో చేరాడు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి, లోకల్ టాలెంట్స్‌ను వెలికితీసేందుకు పూర్తి సమయం వెచ్చించాడు. ఈ మేరకు 1992లో తను శిక్షణనిచ్చిన మొదటి బ్యాచ్ ఆటగాళ్ళు భారతదేశం తరపున ఆడేందుకు ఎంపికయ్యారు. ఇలా అవకాశాలు, వనరులు లేకున్నప్పటికీ రాణిస్తున్న ప్రతిభావంతులకు శ్రీకాంత్ కేరాఫ్‌గా మారాడు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు నెలల తరబడి ఆయన ఇంట్లోనే ఉండేవాళ్లు. నేషనల్ చాంపియన్ అక్షయ్ దేవాల్కర్ 10 సంవత్సరాలు ఆయన ఇంట్లోనే ఉన్నారు. దివ్యాంగులకు కూడా శ్రీకాంత్ చేయూతనిచ్చి, ఆటలో మెరికల్లా తయారుచేశాడు. పారాలింపిక్స్ ప్లేయర్స్ గిరీష్ శర్మ, ఆరతి పాటిల్ కూడా ఆయన విద్యార్థులే కాగా, వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ది బెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. ప్రతిష్టాత్మక దాదాజీ కొండదేవ్ అవార్డు (ఉత్తమ కోచ్- 2003), సమాజ్ శక్తి పురస్కార్ (2011)తో సహా శ్రీకాంత్ అంకితభావానికి, అవిరళ కృషికి అనేక పురస్కారాలు వరించాయి.

బ్యాడ్మింటన్ ప్రపంచంలో నెహ్వాల్ తన పేరు చరితార్థం చేసే ముందు నా ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరానికి హాజరైంది. ఆకలిగొన్న పులిలా, ఎంతో ఫోకస్‌గా గేమ్ ఆడుతున్న సైనాను చూసిన నేను ఆశ్చర్యపోయాను. ఆమె మ్యాచ్‌లన్నీ తప్పకుండా చూస్తాను. ఆమె అందరికంటే డిఫరెంట్. ఇక బయోపిక్ విషయానికొస్తే.. ఈ చిత్రంలో నెహ్వాల్ భర్త పాత్రను షట్లర్ నుంచి కోచ్‌గా మారిన ఇషాన్ నఖ్వీ పోషించాడు. అతడు కూడా నా విద్యార్థే. – శ్రీకాంత్ వాడ్, బ్యాడ్మింటన్ కోచ్

Advertisement

Next Story

Most Viewed