ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించండి : శశాంక్ గోయల్

by Shyam |   ( Updated:2021-12-08 06:16:51.0  )
Shashank2
X

దిశ, మెదక్: డిసెంబర్ 10 న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌‌‌ను పారదర్శకంగా నిర్వహించుటకు అన్నీ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10 న పోలింగ్ ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. పోలింగ్ కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు, హెల్త్ వర్కర్లను నియమించాలని తెలిపారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ ఫోన్లు అనుమతించకూడదని అన్నారు.

అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. పోలింగ్ సామాగ్రితో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు, తిరిగి పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్స్‌‌‌లతో రిసెప్షన్ సెంటర్‌కు వచ్చేటప్పుడు బందోబస్తుతో రావాలని అన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డులు లేదా భారత ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. పోలింగ్ అధికారులు ఇచ్చే వయోలెట్ పెన్నుతోనే బ్యాలెట్ పేపర్‌పై ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేసేలా ఓటర్లకు చెప్పాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఏఎన్ఎం లను అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే ఈనెల 14వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.

అనంతరం సెక్టోరల్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ ఎటువంటి చిన్న సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని, ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటు వేసిన మహిళా, పురుష ఓటర్ల సంఖ్య, శాతం తెలపాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలెట్ బాక్సులు ఇస్తున్నామని, పోలింగ్ ప్రారంభానికి ముందు, పోలింగ్ పూర్తైన తర్వాత ఏజెంట్‌ల సమక్షంలో బ్యాలట్ బాక్సు తెరవడం, క్లోజ్ చేయడం చేయాలని అన్నారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగే ఈ పోలింగ్ లో ఓటర్లకు ఇండెబుల్ ఇంకు వేలుకు రాయాలని సూచించారు. ఓటర్లు ఎన్నికల అధికారులు ఇచ్చే వయొలెట్ కలర్ పెన్‌తోనే ప్రాధాన్యత క్రమంలో అంకెల రూపంలో రాయాలని తెలిపారు. రిసెప్షన్ కేంద్రం నుంచి ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం సరిగ్గా చేసుకోవాలని, రిసెప్షన్ కేంద్రం నుండి బయలుదేరిన తర్వాత ఎక్కడా ఆగకుండా కేంద్రానికి వెళ్లాలని, అదే విధంగా పోలింగ్ ముగిసిన తరువాత నేరుగా రిసెప్షన్ కౌంటర్‌కు వచ్చి అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు.

పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అనుకూలంగ సిటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని, కేంద్రంలో అవసరం మేరకు షామియానా, మంచినీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, విద్యుత్, ర్యాంప్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సుహృద్భావ వాతావరణం కల్పించాలని అన్నారు. ఏ చిన్న సంఘటన జరిగిన ఎన్నికల కమిషన్ చాలా సీరియస్‌గా తీసుకుంటుంది కాబట్టి అత్యంత జాగరూకతో పనిచేయాలని, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని గైడ్ చేస్తూ సాఫీగా జరిగేలా చూడాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల మేరకు పని చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే అధికారులకు తెలపాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, సహాయ ఎన్నికల అధికారి రమేష్, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, సెక్టోరల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story