టెస్టు సిరీస్ నుంచి ఉమేష్ ఔట్?

by Shyam |
టెస్టు సిరీస్ నుంచి ఉమేష్ ఔట్?
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుంచి ఉమేష్ యాదవ్ గాయం కారణంగా వైదొలగినట్లు తెలుస్తున్నది. కాలి పిక్క గాయంతో రెండో టెస్టులో పూర్తిగా బౌలింగ్ చేయకుండానే డ్రెస్సింగ్ రూంకు పరిమితం అయ్యాడు. ఆ తర్వాత అతడికి వైద్య పరీక్షలు చేయగా స్వల్పంగా పిక్కల్లో గాయం అయినట్లు తేలింది. దీంతో అతడిని మూడో టెస్టు నుంచి తప్పించారు. కాగా, పూర్తి విశ్రాంతి తీసుకోకుండా తిరిగి మైదానంలోకి దిగితే పిక్కల గాయం తిరగబెట్టే ప్రమాదం ఉన్నదని గ్రహించిన యాజమాన్యం అతడిని మిగిలిన టెస్టులకు దూరం పెట్టాలని నిర్ణయించింది.

అతడి స్థానంలో నటరాజన్‌కు చోటు కల్పిస్తారని వార్తలు వచ్చినా.. చివరకు శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చింది. నటరాజన్ కేవలం ఒకే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడగా.. శార్దుల్ ఠాకూర్ మాత్రం 62 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ అనుభవం ఉన్నది. గతంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా శార్దుల్ ఎంపికైనా గాయం కారణంగా ఆ సిరీస్ ఆడలేదు. మరోవైపు శార్దుల్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఆరు అర్దసెంచరీలు కూడా ఉన్నాయి. దీంతో బీసీసీఐ శార్దుల్ వైపే మొగ్గు చూపింది. కాగా, ఉమేష్ యాదవ్ గాయం కారణంగా టెస్టులకు దూరం అవడంతో అతడిని తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed