బద్వేల్ ఉప ఎన్నికలో పోటీపై శైలజానాథ్ కీలక ప్రకటన

by Anukaran |
బద్వేల్ ఉప ఎన్నికలో పోటీపై శైలజానాథ్ కీలక ప్రకటన
X

దిశ, ఏపీ బ్యూరో : బద్వేల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వైసీపీని నమ్ముకుంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, అవినీతిమయంగా, అరాచక శక్తుల అడ్డాగా మార్చారని ప్రజలు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ ఉపఎన్నికల్లో ప్రజలకు తెలియజేస్తామని శైలజనాథ్ ప్రకటించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలో అనేక అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. దొంగ సంతకాలు పెట్టి నామినేషన్లు విత్ డ్రా చేసిన పరిస్థితులు కూడా చూసినట్లు చెప్పుకొచ్చారు. పోలీస్ వ్యవస్థ సైతం ప్రజల కోసం కాకుండా వైసీపీ ప్రభుత్వానికి పని చేస్తున్నట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో పరిపాలన రోజురోజుకు దారుణంగా తయారవుతోందని మండిపడ్డారు. అప్పులు తెచ్చుకునే పరిస్థితి నుంచి అడుక్కుతినే పరిస్థితికి ప్రభుత్వం వచ్చేసిందని విమర్శించారు. ఢిల్లీలో కేంద్రం ముందు, బ్యాంకులు ముందు అప్పుల కోసం వేచి చూడాల్సిన దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ విమర్శించారు.

Advertisement

Next Story