భారత్ బంద్‌కు పలు పార్టీల మద్దతు

by Shyam |
భారత్ బంద్‌కు పలు పార్టీల మద్దతు
X

దిశ, క్రైమ్ బ్యూరో : రైతు వ్యతిరేక, వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు తెలంగాణ జన సమితి అధక్షులు ఫ్రొ.కోదండరామ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ సంబంధిత మూడు బిల్లులను ఉపసంహరించుకోవాలని అన్నారు. భారత్ బంద్ సందర్భంగా తెలంగాణ జన సమితి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.

భారత్ బంద్‌లో పాల్గొనండి- న్యూడెమోక్రసీ
రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 11 రోజులుగా పోరాడుతున్న రైతన్నలకు యావత్తు ప్రజానీకం అండగా నిలవాలని సీపీఐ (ఎంఎల్- న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. దేశానికి అన్నం పెట్టే రైతులు దేశ రాజదాని ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో పోరాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు వ్యవసాయరంగాన్ని అప్పగించే బీజేపీ సర్కార్ దేశ ద్రోహాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు.

బీసీ సంక్షేమ సంఘం మద్దతు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ నెల 8న రైతు ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం చేసినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల మద్దతు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న రైతులకు టీఎస్ఆర్టీసీ టీఎంయూ సంపూర్ణ మద్దతును తెలియజేసింది. ఈ సందర్బంగా టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షులు థామస్‌రెడ్డి మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. దేశానికి అన్నం పెట్టే రైతాంగం నడ్డి విరిచే చట్టాలను చేయడం దుర్మార్గమైందన్నారు. రైతాంగాన్ని కార్పొరేట్ శక్తులకు బలిచ్చే విధానాలను వెనక్కు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇటీవల చేసిన నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు టీఎంయూ కార్యకర్తలు అంతా రైతాంగ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీని మోటారు వాహన చట్టం-2019తో నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని విమర్శించారు. అత్యంత ప్రజాధరణ పొందిన ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం ఆలోచన చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి మద్దతుతో పాటు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 8న భారత్ బంద్‌లో పాల్గొనాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed