భారీ లాభాలను సాధించిన సూచీలు!

by Harish |
భారీ లాభాలను సాధించిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య భారీ లాభాలను సాధించాయి. గత రెండు సెషన్లలో అధిక నష్టాలను చూసిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో పుంజుకున్నాయి. ముఖ్యంగా రియల్టీ, మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో కొనుగోళ్ల జోరు కొనసాగడంతో స్టాక్ మార్కెట్లు మెరుగ్గా ర్యాలీ చేశాయి. ఉదయం ప్రారంభం నుంచే లాభాలను సూచిన మార్కెట్లు మిడ్-సెషన్‌కు ముందు చైనాకు చెందిన కంపెనీ ఎవర్‌గ్రాండ్ సంక్షోభం, కొవిడ్ పరిణామాలతో కొంత తడబడ్డాయి. అయితే, యూఎస్ ఫెడ్ సమావేశంలో కీలక నిర్ణయాలు ఉండనున్నాయనే వార్తలతో పాటు యూరప్ మార్కెట్ల నుంచి మద్దతు లభించడంతో మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 514.34 పాయింట్లు ఎగసి 59,005 వద్ద క్లోజయింది. నిఫ్టీ 165.10 పాయింట్ల లాభంతో 17.562 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫార్మా, మెటల్, మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ రంగాలు గణనీయంగా పుంజుకున్నాయి. ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, డా రెడ్డీస్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ షేర్లు లాభాలను సాధించాయి. మారుతీ సుజుకి, బజాజ్ ఆటో, నెస్లె ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.67 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed