వరుసగా మూడోరోజూ నష్టపోయిన సూచీలు!

by Harish |
వరుసగా మూడోరోజూ నష్టపోయిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను నమోదు చేశాయి. ద్రవ్యోల్బణ పెరుగుదల ఆందోళనతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, దేశీయ కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు వరుసగా మూడో సెషన్‌లో పతనమయ్యాయి. గత మూడు వారాల్లో మొదటిసారిగా స్టాక్ మార్కెట్లు వారం మొత్తం నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా మెటల్, ఆటో షేర్లు భారీగా కుదేలవడంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గత కొన్ని సెషన్లుగా గణనీయంగా ర్యాలీ చేస్తున్న టాటా మోటార్స్ గురువారం ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణ కారణంగా బలహీనపడింది.

మరోవైపు దేశీయ అతిపెద్ద ఐపీఓగా సంచలనం సృష్టించిన పేటీఎం మాతృసంస్థ లిస్టింగ్‌లో అందరినీ నిరాశపరిచింది. గురువారం కంపెనీ షేర్లు లిస్టింగ్‌కు రాగా, ఇష్యూ ధర కంటే 9 శాతం దిగువన ట్రేడింగ్ కావడం గమనార్హం. స్టాక్ మార్కెట్లలో రూ.2,150 ధరను నిర్ణయించగా, 27 శాతం నష్టపోయి రూ.1, 564 వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 372.32 పాయింట్లు కోల్పోయి 59,636 వద్ద, నిఫ్టీ 133.85 పాయింట్లు నష్టపోయి 17,764 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ అధికంగా 3 శాతం పతనమవగా, మెటల్, మీడియా, ఐటీ, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలు కుదేలయ్యాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.31 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed