రికార్డు సృష్టించిన సెన్సెక్స్

by Harish |   ( Updated:2021-09-03 07:59:07.0  )
business
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దలాల్ స్ట్రీట్‌లో ఆల్‌టైం గరిష్ఠాలతో సూచీలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 58,000 కీలక మైలురాయిని నమోదు చేసింది. వారం చివరి రోజున ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా సేవల రంగ కార్యకలాపాలు భారీగా పుంజుకోవడం, రిలయన్స్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్ లాంటి కీలక సంస్థల ర్యాలీతో మార్కెట్లు తక్కువ వ్యవధిలో సరికొత్త రికార్డులను అధిగమించాయి. నిఫ్టీ50 ఇండెక్స్ సైతం తొలిసారిగా 17,300 మార్కును అధిగమించింది.

రిలయన్స్ లాంటి దిగ్గజ సంస్థల షేర్లు కీలక మద్దతు ఇవ్వడంతో స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకుని జీవితకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 277.41 పాయింట్లు ఎగసి 58,129 వద్ద క్లోజయింది. నిఫ్టీ 89.45 పాయింట్లు లాభపడి 17,323 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ అధికంగా 2.5 శాతం దూసుకెళ్లగా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, మెటల్, మీడియా, ఆటో రంగాలు బలపడ్డాయి. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ సంస్థ షేర్ అధికంగా 4 శాతానికి పైగా ర్యాలీ చేసింది. టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి షేర్లు లాభాలను సాధించాయి.

హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.02 వద్ద స్థిరపడింది.

Advertisement

Next Story