అదే జోరు.. లాభాల బాటలో మార్కెట్లు!

by  |
అదే జోరు.. లాభాల బాటలో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. దీంతో వరుస నాలుగో రోజు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలతో దేశీయ సూచీల సెంటిమెంట్ బలపడింది. పైగా ఇండియాలో కరోనాకు వ్యాక్సిన్ తయారీపై నమ్మకం పెరుగుతుండటం దీనికి కలిసొచ్చింది. భారత్ బయోటెక్, క్యాడిలా తయారు చేస్తున్న వ్యాక్సిన్ కీలకమైన దశలో ఉన్నాయి. అంతేకాకుండా గిలియడ్ సైన్స్, ఫ్యూజీ ఫిల్మ్ ఔషధాలతో చికిత్స చేసే వేగం పెరిగింది. అంతేకాకుండా, దేశంలో కరోనా నుంచి రికవరీల సంఖ్య పెరగడం కూడా మదుపర్లకు సానుకూల సంకేతాలు కనబడ్డాయి.

లాక్‌డౌన్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు మొదలవడం, ఆటోమొబైల్ అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల కనబడుతుండంతో మార్కెట్లో ఆశలు రేకెత్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 465.86 పాయింట్ల లాభంతో 36,487 వద్ద ముగియగా, నిఫ్టీ 156.30 పాయింట్లు ఎగిసి 10,763 వద్ద ముగిసింది. ముఖ్యంగా, నిఫ్టీ బ్యాంకింగ్, ఆటోమొబైల్, మెటల్ రంగాలు లాభాల బాట పట్టడంతో ర్యాలీ జోరందుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎఫ్ఎంసీజీ, విద్యుత్, ఐటీ రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఫార్మా రంగం మాత్రమే కాస్త నీరసించింది. ఇక, సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ సూచీలు అధిక లాభాలను నమోదు చేయగా, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.


Next Story

Most Viewed