లాభాల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు

by Harish |
లాభాల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను దక్కించుకున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మంగళవారం స్వల్ప లాభాలకు పరిమితమైన సూచీలు బుధవారం ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాల అనంతరం ఇంట్రాడే గరిష్ఠాలను సాధించాయి. పాలసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ప్రకటన ఉండటంతో ఈక్విటీ మార్కెట్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, టెక్, ఆటో, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. మెటల్ రంగం ఇండెక్స్ వరుసగా ఎనిమిదో రోజు లాభాల జోరును కొనసాగించడంతో 8 నెలల్లో మొదటిసారి ఈ స్థాయి ర్యాలీని సాధించింది. దీంతో 2011 నాటి గరిష్ఠ స్థాయికి మెటల్ ఇండెక్స్ చేరుకుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అలాగే, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, ఆసియా మార్కెట్లు సైతం అదే ధోరణిలో ట్రేడవ్వడంతో దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం కనిపించిందని విశ్లేషకులు తెలిపారు. వీటికి తోడు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ భారత వృద్ధి రేటును 12.5 శాతానికి అంచనా వేయడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 460.37 పాయింట్లు ఎగసి 49,661 వద్ద ముగియగా, నిఫ్టీ 135.55 పాయింట్ల లాభంతో 14,819 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ దాదాపు 2 శాతం బలపడగా, ఆటో, ఫైనాన్స్, ఐటీ, మెటల్, రియల్టీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, ఎన్‌టీపీసీ, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.36 వద్ద ఉంది.

Advertisement

Next Story