డీలాపడ్డ మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల (Domestic equity markets)కు మళ్లీ నష్టాలు తప్పలేదు. వరుసగా రెండు రోజుల లాభాల తర్వాత గురువారం మళ్లీ సూచీలు కుదేలయ్యాయి. భారత్-చైనా సరిహద్దు వివాదం కారణంగా మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కనిపించాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు అమెరికా ఫెడ్ (American Fed) రానున్న మూడేళ్ల వరకు వడ్డీ రేట్లను సున్నాకు దగ్గరలోనే కొనసాగిస్తామన్న ప్రకటనతో అమెరికా మార్కెట్లు (American Markets) ప్రతికూలంగా కదలాడాయి. వీటి ప్రభావం దేశీయ మార్కెట్ల (domestic markets)పైనా పడిందని మార్కెట్ల నిపుణులు భావిస్తున్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 323 పాయింట్లు కోల్పోయి 38,979 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty) 85.30 పాయింట్లు నష్టపోయి 11,519 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, మీడియా రంగాలు బలపడగా, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌ (Sensex Index)లో హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకి, ఓఎన్‌జీసీ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ట్రేడయ్యాయి. ముఖ్యంగా బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్, ఎల్అండ్‌టీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా రంగాలు అధికంగా నష్టపోయాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.66 వద్ద ఉంది.

Advertisement