సీసీఎంబీ పరిశోధనలో సంచలన విషయాలు

by Shamantha N |   ( Updated:2021-02-20 10:50:10.0  )
సీసీఎంబీ పరిశోధనలో సంచలన విషయాలు
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వేలాది రూపాలను ధరిస్తూ జిత్తులమారి తనాన్ని నిరూపించుకుంటున్నది. వుహాన్‌లో వెలుగుచూసిన వేరియంట్‌కు భిన్నంగా యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు ప్రపంచదేశాలను వణికిస్తున్నాయి. మనదేశంలోనే 7,569 స్ట్రెయిన్‌లు వ్యాప్తి చెందుతున్నాయని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యూలర్ బయోలజి(సీసీఎంబీ) తాజా పరిశోధనలో వెల్లడైంది. సీసీఎంబీకి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో తేలింది. ఇందులో సీసీఎంబీ స్వయంగా 5000 వేరియంట్లను గుర్తించింది. దేశంలో సరిపడా జీనోమ్ సీక్వెన్సింగ్ అనాలసిస్‌లు జరగడం లేదని, అయినప్పటికీ ఈ స్థాయిలో వేరియంట్లు బయటపడ్డాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే జీనోమ్ సీక్వెన్సింగ్ అనాలిసిస్‌లు పెరగాలని భావిస్తున్నారు.

విదేశాల్లో గుర్తించిన కరోనా వేరియంట్లు భారత్‌లో స్వల్పంగా నమోదవుతున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ల కేసులు ఇక్కడ తక్కువగానే రిపోర్ట్ అవుతున్నాయని చెప్పారు. మనదేశంలో స్వల్ప స్థాయిలో జీనోమ్ సీక్వెన్స్‌లూ జరగడం అందుకు కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్440కే వేరియంట్ అధికంగా వ్యాపిస్తున్నదని, దీని వ్యాప్తి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి నిఘా వేయాల్సిన అవసరముందని తెలిపారు.

Advertisement

Next Story