సర్కార్‌కు షాక్.. ప్రమోషన్లతో కొత్త చిక్కులు

by Anukaran |   ( Updated:2021-12-20 11:41:45.0  )
సర్కార్‌కు షాక్.. ప్రమోషన్లతో  కొత్త చిక్కులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య, విద్య పరిధిలో అడిషనల్​ డీఎంఈలుగా ప్రమోషన్లు పొందిన సీనియర్​ ప్రోఫెసర్లతో సర్కార్​కు కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఇటీవల 31 మందికి ఏడీఎంఈలుగా పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్​లు ఇచ్చింది. ఈ నెల 22వ తేది వరకు వెంటనే చేరాలని గడువు విధించింది. కానీ ఇప్పటి వరకు సగం మంది కూడా చేరలేదు. ఆ పోస్టింగ్​ల్లో చేరిది లేదని పదోన్నతులు పొందిన సీనియర్​ ప్రోఫెసర్లు సర్కార్​కు తేల్చి చెబుతున్నారు. పాత స్థానాల్లోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. సీనియర్లకు దూర ప్రాంతాల్లో పోస్టింగ్ లిచ్చి, జూనియర్లకు హైదరాబాద్​ పరిధిలోని కాలేజీల్లో ఇవ్వడమే నిరాకరణకు కారణంగా ఓ సీనియర్​ ప్రోఫెసర్​ దిశకు తెలిపారు. గతంలో హెల్త్​ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పులు రాలేదన్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రమోషన్లు తీసుకోకుండా పాత స్థానాల్లోనే కొనసాగుతామని సీనియర్​ ప్రోఫెసర్లు నొక్కి చెబుతున్నారు. మరి కొందరైతే వాలంటరీ రిటర్మెంట్​ ను కోరుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న 8 మెడికల్​ కాలేజీల్లో ప్రిన్సిపాళ్ళు, సూపరింటెండెంట్లు కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నది. మరోవైపు ఈ వారంలోనే నేషనల్​ మెడికల్​ కమీషన్​ తనిఖీలు కూడా ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. ఆ కమిటీ వచ్చే లోపల కొత్త కాలేజీల్లో స్టాఫ్​, మౌలిక వసతులు లేకుంటే రిమార్కులు రాసే ప్రమాదం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

మొదట్నుంచి సమస్యలే..

సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలబెట్టిన కొత్త మెడికల్​ కాలేజీల్లో ఆరంభం నుంచే సమస్యలు వేధిస్తున్నాయి. సంగారెడ్డి,మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల,జగిత్యాల,వనపర్తి,నాగర్ కర్నూల్, రామగుండం ఏరియాల్లో వచ్చే కాలేజీలకు స్థల సేకరణ దగ్గర నుంచి నిర్మాణ ప్లాన్​లకు వాస్తు లోపాలు, అనుకున్న సమయానికి భవనాల నిర్మాణాలను పూర్తి చేయడం వంటి అంశాల్లో అధికారులకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ఆ నిర్మాణ పనులను సర్కార్​ రోడ్ల, భవనాల శాఖకు అప్పగించింది. అయితే ఎన్ఎంసీ తనిఖీ లోపు సీఎం కేసీఆర్​ సూచనతో తాత్కాలిక షెడ్లను నిర్మిస్తున్నారు. అవీ పూర్తి కాకపోవడమే కాకుండా, ఇప్పుడు కొత్తగా ప్రిన్సిపాళ్ల కొరత వేధించనున్నది. దీంతో ఎన్​ఎంసీ వచ్చే సమయంలోపు సర్కార్​ ఏం చేస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు ప్రమోషన్లు పొందిన వారు గడువులోపు పోస్టింగ్​ లో చేరకపోతే వీరి కంటే జూనియర్లకు ప్రిన్సిపాళ్ళు, సూపరింటెండెంట్ల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed