ఐపీఎల్‌ వాయిదా.. జట్టులో చోటు దక్కేదెలా ?

by Shyam |
ఐపీఎల్‌ వాయిదా.. జట్టులో చోటు దక్కేదెలా ?
X

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా స్తంభించిన వేళ.. ఐపీఎల్‌ను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా గురువారం ప్రకటించారు. కాగా, ఐపీఎల్ వాయిదాతో చాలా మంది ఆటగాళ్లు డీలా పడ్డారు. విదేశీ ఆటగాళ్లు ఆర్థికంగా నష్టపోయామనే బాధలో ఉంటే.. ఇక భారత క్రికెటర్లు మాత్రం టీ20 వరల్డ్ కప్‌లో ఆడే ఛాన్స్ వస్తుందో రాదో అనే ఆందోళనలో పడ్డారు. ఎందుకంటే.. ఐపీఎల్‌లో సత్తా చాటి ఈ ఏడాది నవంబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించాలని ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లకు ఇది మింగుడుపడని విషయమే. ఈ లిస్టులో ముఖ్యంగా ఎంఎస్ ధోనీ, హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్, దినేష్ కార్తీక్ వంటి ఆటగాళ్లు ఉండటం గమనార్హం.

ఐపీఎల్‌లో సత్తా చాటి సెలెక్టర్లు దృష్టిలో పడాలని వీరంతా భావించారు. ఇక ఏడాది కాలంగా క్రికెట్ ఆడని ఎంఎస్ ధోనీ పునరాగమనం కూడా ఐపీఎల్‌ ఫామ్‌పైనే ఆధారపడి ఉంది. అసలే రిటైర్మెంట్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో.. కనీసం ఐపీఎల్ ద్వారానైనా తన సత్తా చాటాలని భావించాడు. ఈ సారి టీ20 వరల్డ్ కప్ ఆడకపోతే ఇక జీవితంలో ధోనీకి ఆ ఛాన్స్ రాదు. ఐపీఎల్ వాయిదాతో అతడి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక న్యూజిలాండ్ పర్యటనలో గాయాల పాలైన భువనేశ్వర్, శిఖర్ ధావన్‌లు కూడా ఐపీఎల్ ద్వారా తమ పునరాగమనాన్ని ఘనంగా చాటాలనుకున్నారు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోసం యువ ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శిఖర్ ధవన్ లేని ఓపెనింగ్ లోటును కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు తీర్చారు. ఇక భువీ లేకపోయినా భారత జట్టు పేస్ విభాగం బలంగానే కనపడుతోంది. మరోవైపు దీపక్ చాహర్ లాంటి యువ క్రికెటర్లతో సహా దినేష్ కార్తీక్ లాంటి సీనియర్ క్రికెటర్లు కూడా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం భారీగా ఆశలు పెట్టుకున్నారు. ‘తనకు తప్పకుండా ఛాన్స్ వస్తుందని కార్తీక్ ఇటీవల ధీమా వ్యక్తం చేస్తున్నా.. ధోనీ, పంత్, కేఎల్ రాహుల్ వంటి వికెట్ కీపర్లను కాదని కార్తీక్‌కు చోటు దక్కుతుందా అనేది అనుమానమే.

కాగా, వరల్డ్ కప్‌ జట్టు ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శన ప్రాతిపదిక కాదని సెలెక్టర్లు, బీసీసీఐ కూడా చెబుతూ వచ్చింది. ఫిట్‌నెస్, ఫామ్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఇక మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అయితే ఐపీఎల్‌కు సంబంధం లేకుండా ఎంపికయ్యే ఆటగాడు హార్థిక్ పాండ్యా మాత్రమేనని వ్యాఖ్యానించాడు. వెన్ను నొప్పి సర్జరీ తర్వాత డీవై పాటిల్ టోర్నీలో పాండ్యా సత్తా చాటిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మరి సెలెక్టర్ల మనసులో ఏముందో కాలమే నిర్ణయించాలి.

Tags :IPL, T20, Team Selection, MS Dhoni, Dinesh Karthik, Bhuvneshwar, Pant

Advertisement

Next Story

Most Viewed