తలసాని ఆదేశాలు బేఖాతర్.. రోడ్డెక్కిన వ్యాపారులు.. భారీగా ట్రాఫిక్

by Shyam |   ( Updated:2021-10-09 05:00:47.0  )
drainage problem
X

దిశ, బేగంపేట: సికింద్రాబాద్‌ ఆర్పీరో‌డ్‌లోని నాలాపై వంతెన నిర్మాణ పనుల జాప్యంపై స్థానిక వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆర్పీరోడ్, జనరల్ బజార్, అంజలి థియేటర్ ప్రాంతాల్లోని వ్యాపారులందరూ పనుల జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అరగంట పాటు ఆర్పీరోడ్డులో వాహనాలను నిలిపేయడంతో కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఏడు నెలల కాలం నుంచి పనులు నత్తనడక జరుగుతుండటంతో ఈ ప్రాంతంలో వ్యాపారాలు అరకొరగా కొనసాగుతున్నాయి. దీంతో అందరూ ఏకతాటిపైకి వచ్చి, ఆందోళనకు దిగారు. వ్యాపారం సరిగ్గా జరుగక, ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి వ్యాపారాల్లో నష్టాలు వస్తూ.. అప్పుల పాలయ్యామని అన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యాపారాలకు జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం తోడై తాము రోడ్డున పడే పరిస్థితి నెలకొందని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలుమార్లు వంతెన పనులు వేగవంతం చేయాలని ఆదేశించినా అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని వాపోయారు. అంతేగాకుండా.. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, స్థానిక గోపాల్‌పేట్ కార్పొరేటర్ చీర సచిత్రాశ్రీకాంత్‌ అధికారులను ఆదేశించినా పట్టించుకున్న పాపాన పోలేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. స్థానికులు ఆందోళన చేస్తోన్న విషయం తెలుసుకున్న మహంకాళి ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ అక్కడికి చేరుకొని వ్యాపారులతో మాట్లాడి వారిని సముదాయించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు గన్ శ్యామ్, రవి శంకర్, నాందేవ్ మంగ్లీ, సంజయ్ జైన్, ప్రిథ్వీరాజ్, రమేష్ గుప్తా, మదన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed