అటకెక్కిన ఫీవర్ సర్వే.. బ్రేక్ వేసిన వ్యాక్సినేషన్

by Aamani |
అటకెక్కిన ఫీవర్ సర్వే.. బ్రేక్ వేసిన వ్యాక్సినేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే మూడు రోజులకే పరిమితమయింది. మూడు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా హైరిస్క్ పర్సన్స్ కు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపడుతుండటంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత కనిపిస్తోంది. ఫీవర్ సర్వే ప్రారంభమైనప్పటి నుంచి బల్దియా అధికారులు ప్రకటిస్తున్న గణంకాలకు, వాస్తవ స్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. మొత్తానికి మొదటి విడత పూర్తి చేశామని ప్రకటించి రెండో విడతకు సిద్ధమయ్యారు. అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోయినా సర్వేను పూర్తి చేసినట్ట జీహెచ్ఎంసీ ప్రకటించడం గమనార్హం.

గ్రేటర్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వే పర్యవేక్షణ, పారదర్శకత లేకుండానే కొనసాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకుండా తొలి విడతను విజయవంతంగా ముగించినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇక రెండో విడత ఫీవర్ సర్వేను 22వ తేదీని ప్రారంభించామన్న బల్దియా అధికారులకు మూడు రోజులకే బ్రేక్ వేశారు. నగరంలో కొవిడ్ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి మెడిసిన్స్ ఇచ్చేందుకు నిర్ధేశించిన ఫీవర్ సర్వేపై పర్యవేక్షణ కొరవడింది. కరోనాకు సంబంధించిన సర్వీసుల్లో ఉన్నతాధికారులు ఉండటంతో ఫీవర్ సర్వే కేవలం మొక్కుబడి తంతుగా మారిపోయంది. ఈ నెల 3న మొదటి విడత ఫీవర్ సర్వేను ప్రారంభించిన జీహెచ్ఎంసీ 21వ తేదీతో పూర్తయినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. మొదటి విడతలో 17,14,477 ఇండ్లల్లో సర్వే చేసినట్టు చెబుతుండగా.. ఎంతమందికి మెడిసిన్స్ ఇచ్చారు. ఎంతమందిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారనే విషయాలపై రహస్యంగా వ్యవహరిస్తోంది. అయితే ఆరు వేలకు పైగా మందికి జ్వర లక్షణాలు ఉన్నవారికి ఈ సర్వేలో మెడిసిన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

393 బృందాలతో మొదలైన ఇంటింటి ఫీవర్ సర్వేను గరిష్టంగా 1,735 బృందాలతో సర్వే నిర్వహించినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. బల్దియా పరిధిలో ఉన్నదే 1,102 మంది ఏఎన్ఎంలు కాగా అన్ని బృందాలను ఏర్పాటు బృందాలను ఎలా ఏర్పాటు చేశారో జీహెచ్ఎంసీ అధికారుల వద్ద సమాధానం లేదు. రెండో విడతలో భాగంగా మూడు రోజుల ఇంటింటి ఫీవర్ సర్వేలో 3,42.479 ఇండ్లలో సర్వే నిర్వహించినట్టు అధికారులు చెబుతున్నారు. రోజుకు 1,500 బృందాల చొప్పున సర్వేలో పాల్గొంటుండగా.. సగటున ఒక్కో టీమ్ 85 ఇండ్లను సర్వే చేస్తున్నట్టు గణంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా రెగ్యులర్ డ్యూటీ సమయాలను పరిగణలోకి తీసుకుంటే భోజన విరామం, ఇతర క్షేత్రస్థాయి పరిస్థితుల ప్రకారం చూస్తే ఒక రోజులో గరిష్టంగా యాభై ఇండ్లల్లో సర్వే పూర్తి చేయడం కూడా కష్టమేనని సీనియర్ అధికారి చెబుతున్నారు.

గత నాలుగు రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కారణంగా ఫీవర్ సర్వే పూర్తిగా అటకెక్కింది. ఫీవర్ సర్వేలో ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్, ఎంటమాలజీ సిబ్బంది బృందాలుగా ఉంటారు. ఈ టీమ్ లను డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఓహెచ్ లు పర్యవేక్షించాల్సి ఉంది. వీరంతా ప్రస్తుతం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో ఉన్నారు. ఇంటింటి సర్వేలోనూ, వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనూ సర్కిల్ అధికారులతో సహా క్షేత్రస్థాయి సిబ్బందిని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. దీంతో ఇంటింటి సర్వే చేపట్టేందుకు సిబ్బంది కరువయ్యారు. సర్వే చేసిన రోజుల్లోనూ సర్కిల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అపార్ట్ మెంట్లు, కమ్యూనిటీ బిల్డింగ్ ల్లో సర్వే అంతంత మాత్రంగానే కొనసాగింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ లో జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఉంటుండటం మెడికల్ సిబ్బందిని కూడా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉంచుతుండటంతో రెండో విడత ఇంటింటి పీవర్ సర్వే పూర్తిగా పక్కకు పోయినట్టే కనిపిస్తోంది.

Advertisement

Next Story